భగవద్గీత 5-18

“ విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |     

శునిచైవశ్వపాకేచపండితాఃసమదర్శినః|| ”

పదచ్ఛేదం

విద్యావినయసంపన్నే – బ్రాహ్మణే – గవి – హస్తిని – శుని – చ – ఏవ – శ్వపాకే – చ – పండితాః – సమదర్శినః

ప్రతిపదార్థం

పండితాః = పండితులు ; విద్యావినయసంపన్నే = విద్యతో , వినయంతో ఉన్న ; బ్రాహ్మణే చ = బ్రాహ్మణునియందు ; గవి = గోవును ; హస్తిని = ఏనుగుయందు ; శుని = కుక్కనందు ; శ్వపాకే చ = ఛండాలునియందు ; సమదర్శినః ఏవ = సమదృష్టినే కలిగి ఉంటారు

తాత్పర్యం

“ విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, ఛండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన జంతువులు … అన్నింటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు.”

వివరణ

“ పండితుడు ” అంటే, ఆత్మజ్ఞాన విశారదుడు …

అందరినీ ఆత్మస్వరూపంగా … సమానంగా చూసేవాడు.

“ పండితుడు ” అంటే “ వ్యాకరణ పండితుడు ”, “ సంస్కృత పండితుడు ”

కాడు !

విద్యతో, వినయంతో కూడుకున్న బ్రాహ్మణుడయిన … అంటే …

నిర్గుణ ప్రకాశకుడయినా …

శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన “ ఆవు ” లాంటి వారు అయినా …

సాత్విక గుణ ప్రధానమైన “ ఏనుగు ” లాంటి వారయినా …

రజోగుణం కలిగిన “ కుక్క ” లాంటి వారు అయినా …

కుక్క మాంసం వండుకుని తినే …

అత్యంత తమోగుణం కలిగిన ఛండాలుడు అయినా …

ఏ గుణం కలిగిన వారైనా … పండితుడికి … సమానమే.

అదే విధంగా మనిషి అయినా జంతువయినా …

అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు “ పండితుడు ” …

ఆ విధంగా సకలప్రాణకోటినీ సమంగా చూడలేనివాడు “ పామరుడు ”.