భగవద్గీత 4-39

“ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |

జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి || ”

 

పదచ్ఛేదం

శ్రద్ధావాన్ – లభతే – జ్ఞానం – తత్పరః – సంయతేంద్రియః – జ్ఞానం – లబ్ధ్వా – పరాం – శాంతిం – అచిరేణ – అధిగచ్ఛతి

ప్రతిపదార్థం

సంయతేంద్రియః = జితేంద్రియుడు ; తత్పరః = సాధనా పరాయణుడు ; శ్రద్ధావాన్ = శ్రద్ధ గలవాడు ; జ్ఞానం = ఈ తత్త్వజ్ఞానాన్ని ; లభతే = పొందుతాడు ; జ్ఞానం, లబ్ధ్వా = (ఈ) జ్ఞానాన్ని పొంది ; అచిరేణ = తత్ క్షణమే ; పరం, శాంతిం = పరమ శాంతిని ; అధిగచ్ఛతి = పొందుతాడు.

తాత్పర్యం

“ ఇంద్రియాలను జయించి శ్రద్ధాసహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్నీ, దానిని పొందిన శీఘ్రకాలంలోనే పరమశాంతినీ పొందుతాడు. ”

వివరణ

శ్రద్ధ .. సాధనా పరాయణత్వం .. ఇంద్రియ నిగ్రహం …

ఇవన్నీ … ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నవి.

మనస్సు, ఇంద్రియాలు వశమయ్యేటందుకూ,

మరి ఆత్మజ్ఞానాన్ని పొందడానికీ,

సంపూర్ణంగా ఆత్మతత్వం గ్రహించడానికీ …

శ్రద్ధతో, తదేక దీక్షతో …

ధ్యానసాధన అన్నది చేస్తూనే, చేస్తూనే ఉండాలి.

అప్పుడే జ్ఞానం …

‘ బ్రహ్మజ్ఞానం ’ కలుగుతుంది …

తద్వారా పరమశాంతి లభిస్తుంది.

శ్రద్ధ లోపిస్తే, సాధన కుంటుబడితే, విషయాసక్తి పెరిగితే …

పతనం తప్పదు.