భగవద్గీత 4-19

“ యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |       

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || ”

 

పదచ్ఛేదం

యస్య – సర్వే – సమారంభాః – కామసంకల్పవర్జితాః – జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం – తం – ఆహుః – పండితం – బుధాః

ప్రతిపదార్థం

యస్య = ఎవరి యొక్క ; సర్వే = సమస్త ; సమారంభాః = కర్మలు ; కామసంకల్ప వర్జితాః = కోరిక , సంకల్పాలు ఉండవో ; జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం = జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైన కర్మలు కల ; తం = అతనిని ; బుధాః = జ్ఞానులు ; పండితం = పండితుడు అని ; ఆహుః =అంటారు.

తాత్పర్యం

“ ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక, సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వానిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు. ”

వివరణ

కర్తృత్వభావన లేకుండా, కర్మఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను “నిష్కామకర్మలు” అంటారు.

“ కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడం ” అంటే …

“ నేనే చేస్తున్నాను ఈ పనిని ” అనే భావం లేకపోవడం.

కర్మఫలాసక్తి లేకపోవడం అంటే “ ఫలితంతో నాకు సంబంధం లేదు;

కర్మ చేయడమే నా ధర్మం ” అనే భావంతో కర్మలు చెయ్యడం.

నిష్కామకర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది.

చిత్తశుద్ధి కలవాడికి ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది.

ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని …

‘ జ్ఞానాగ్ని ’ ప్రజ్వరిల్లుతుంది.

నిష్కామకర్మలు చేసేవానికి …

“ ఆగామి కర్మ ” …

“ ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్మ ” … ఏమీ ప్రాప్తించదు.

తద్వారా “ సంచితకర్మకు ” …

ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు …

అదనంగా ఏమీ జమ చేయబడదు.

ఇక “ ప్రారబ్ధకర్మ ” అనేది …

ఈ జన్మకు వచ్చే ముందు వరకూ ఉన్న “ సంచిత కర్మల ” లోంచి …

ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ.

అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే,

మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు …

సమస్త కర్మలూ దగ్ధమైనందువల్ల …

అవి దుఃఖంనిచ్చే శక్తిని కోల్పోతాయి.

వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు.

వర్తమానకర్మలు ఏమీ లేకుండా, వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా …

ఆగామి, సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే …

“ పండితుడు ” అని చెపుతారు జ్ఞానులు, బుధులు, విజ్ఞులు.

‘ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ’ …

జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి.

ఈ జ్ఞానం అనేది “ ఆత్మజ్ఞానం ”.

ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి .. ధ్యాన సాధన చేయాలి …

ధ్యాన సాధన ద్వారా పండాలి …

పండితుడు కావాలి !