భగవద్గీత 4-13

“ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || ”

 

పదచ్ఛేదం

చాతుర్వర్ణ్యం – మయా – సృష్టం – గుణకర్మవిభాగశః – తస్య – కర్తారం – అపి – మాం – విద్ధి – అకర్తారం – అవ్యయం

ప్రతిపదార్థం

చాతుర్వర్ణ్యం = ‘ బ్రాహ్మణ ’, ‘ క్షత్రియ ’, ‘ వైశ్య ’, ‘ శూద్ర ’ అనే నాలుగు వర్ణాల సమూహం ; గుణకర్మ విభాగశః = గుణాల చేత , మరి కర్మల యొక్క విభాగాలను అనుసరించి ; ‘మయా’ = ‘ నాచేత ’ ; సృష్టం = సృష్టించబడ్డవి ; తస్య, కర్తారం, అపి = దానికి కర్తను అయినప్పటికీ ; ‘ మాం ’ = ‘ నన్ను ’ ; అవ్యయం = అవినాశిగానే ; అకర్తారం = అకర్తగానే ; విద్ధి = తెలుసుకో

అర్జునుడు = నేను శరీరం అనుకునే తత్వం

శ్రీకృష్ణుడు = నేను ఆత్మ అనే తత్వం

నేను = ఆత్మ

భగవాన్ ఉవాచ – ఆత్మ ఉవాచ:-

“ ‘ బ్రాహ్మణ ’, ‘ క్షత్రియ ’, ‘ వైశ్య ’, ‘ శూద్రులు ’ … అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘ నా చేత ’ … సృష్టించబడింది; ఈ రకమైన సృష్టి రచనకు కర్తను ‘ నేనే ’ అయినప్పటికీ నాశరహితమైన ‘ నన్ను ’ … ‘ అకర్త ’ గానే నువ్వు తెలుసుకో ”.

వివరణ

ఎక్కడెక్కడ ‘ మాం ’, ‘ మయి ’ అని వచ్చినా కూడా అవి ధ్యానానికి/ ఆత్మకు

సూచికలు అన్నది మనం గుర్తుంచుకోవాలి.

అవి కృష్ణునికి సూచికలు ఎంత మాత్రం కావు !

‘ వర్ణం ’ అంటే రంగు … మనిషి యొక్క ‘ ఆరా ’ రంగు !

‘ ఆరా ’ అంటే ‘ ఆస్ట్రల్ బాడీ ’ అంటే … ‘మనోమయకోశం’.

ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ వుంటాయి !

మనస్సు ‘ క్రోధం ’ గా వున్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది.

మనస్సు ‘ లేకి ’ గా వున్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి వుంటుంది.

ఈ రంగులను ‘ శూద్రవర్ణం ’ గా, ‘ తమోగుణం ’ గా అభివర్ణించారు !

గ్రుడ్డిగా ‘ నేనే ’ సత్యంఅనివాదిస్తున్నప్పుడునల్లటిఆరంజిరంగుకలిగి

వుంటుంది. ఈ రంగును, నల్లటి ఆకుపచ్చ రంగును,

‘ వైశ్యవర్ణం ’ గా, ‘ రజోగుణం ’ గా అభివర్ణించారు !

మనస్సు ‘ నాకు తెలియదు ’ అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలిరంగు కలిగి వుంటుంది.

‘ పునర్జన్మ’ మరి ‘ కర్మసిద్ధాంతం ’ల అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి వుంటుంది.

‘ ముముక్షువు ’ గా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు ఇండిగో రంగుని కలిగి ఉంటుంది.

ఈ రంగులను ‘ క్షత్రియ వర్ణం ’ గా, ‘ సాత్విక వర్ణం ’ గా అభివర్ణించారు.

మనస్సు పూర్తిగా ‘ శుద్ధం ’ అయినప్పుడు …

‘ అహం బ్రహ్మాస్మి ’ అని తెలుసుకున్నప్పుడు …

పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి వుంటుంది.

ఈ రంగును ‘ బ్రాహ్మణ వర్ణం ’ గా, ‘ శుద్ధ సాత్వికం ’గా లేదా ‘ నిర్గుణం ’ గా అభివర్ణించారు.

‘ దివ్యచక్షువు ’ తోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు.

అంతర్ గుణాన్ని బట్టే బహిర్ కర్మ సదా వ్యక్తం అవుతూ వుంటుంది !

బయట కర్మను బట్టి అంతర్ గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతుంది.

తమోగుణం లోని వారిని శూద్రులుగా …

రజోగుణం లోని వారిని వైశ్యులుగా …

సాత్విక గుణం లోని వారిని క్షత్రియులుగా …

శుద్ధసాత్విక లేదా నిర్గుణం వారిని బ్రహ్మణులుగా …

పూర్వపు ఋషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు.

పైన వున్న ‘ మాస్టర్స్ ’, దేవుళ్ళు ఎప్పుడూ

‘ క్రింద వున్న మానవుల ’ గుణకర్మలను నిర్దేశించరు !

ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ వుంటారు.

మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం …

మనం ఎవరమో నిర్ణయించుకుంటాం.

బ్రాహ్మణకులంలో పుడితే బ్రాహ్మణులం కాము.

మనం బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం.

మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం …

పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు …

రాజుగారికి పుట్టినా క్షత్రియుడు కాలేడు.

ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు.

ఈ మూడు గుణాలూ లేని వాడే “ శూద్రుడు ” అనిపించుకుంటాడు.

కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం.

మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం !

మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం !

‘ నేను ’ ఆత్మ అన్న పదార్థం ఒకప్రక్క నిరంతరంగా,

మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా …

మరొక ప్రక్క దేనినీ సృష్టించని … దేనికీ కర్త గాని … అవినాశి అయిన

అవ్యయమైన ‘ మూల పదార్థం ’ అని కూడా తెలుసుకోవాలి … అదే జ్ఞానం !

అంటే ప్రతి ‘నేను’ కూడా …

ప్రతి ‘ఆత్మ’ కూడా …

ఒకప్రక్క సృష్టికర్త … మరొక ప్రక్క సృష్టిసాక్షి !

గుణకర్మల విభాగాన్ని అనుసరించి వర్ణాల సముదాయం