భగవద్గీత 4-8

“ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || ”

 

పదచ్ఛేదం

పరిత్రాణాయ – సాధూనాం – వినాశాయ – చ – దుష్కృతాం – ధర్మసంస్థాపనార్థాయ – సంభవామి – యుగే – యుగే

ప్రతిపదార్థం

సాధూనాం = సత్పురుషుల యొక్క ; పరిత్రాణాయ = రక్షణ కోసం ; దుష్కృతాం = దుష్టుల యొక్క ; వినాశాయ = నాశనం కోసం; చ = మరియు ; ధర్మసంస్థాపనార్థాయ = ధర్మాన్ని స్థాపించటానికి ; యుగే యుగే = ప్రతి యుగంలోనూ ; సంభవామి = (నేను) అవతరిస్తాను

తాత్పర్యం

“ సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను. ”

వివరణ

జయము – ‘ వి ’జయము, ఖ్యాతి – ‘ వి ’ఖ్యాతి, నాశము — ‘ వి ’నాశము …

ఇలా ‘ వి ’ అనేది విశేషమైన పదానికి సూచిక.

అలాగే “ పరిత్రాణాయ ”లో “ పరి ” అనేది, మరి “ సంస్థాపనార్థాయ ”,

“ సంభవామి ” అన్న పదప్రయోగాలలో “ సం ” అన్నవి చక్కటి ఉపసర్గలు …

విశేషార్ధకంగా ఉపయోగింపబడే ఉపసర్గలు.

సాధువులు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు ;

“ సం ” రక్షింప బడుతూనే ఉంటారు ;

ఏకాలంలోనైనా కూడా సత్యం మారదు.

ఎప్పుడూ మంచి అన్నది సంరక్షింప బడుతూనే ఉంటుంది ;

చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది.

దుష్టవర్తనులకు ఎప్పుడూ ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది.

ఇది సత్యం ; ఇది కర్మ సిద్ధాంతం ; ఇది పురోగమన సిద్ధాంతం.

చెడు చెయ్యడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ ప్రత్యేకంగా అడ్డగించరు …

చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది.

మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా ప్రోత్సహించరు …

మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది.

మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశము జరుగుతాయి.

“ నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను ”

అని అర్జునుడు అన్నప్పుడు …

శ్రీకృష్ణులవారన్నారు “ నీవు ఎవ్వరినీ చంపజాలవు ;

శరీరం చనిపోతుంది కానీ ఆత్మచావదు ” అని.

అదే సత్యం. అంతకంటే వేరొకటి లేదు.

“ సంభవామి యుగే యుగే ” …

ప్రతి ఆత్మ కూడానూ ఎప్పటికప్పుడు, మళ్ళీ మళ్ళీ …

పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది.

ఆత్మకు పుట్టుక, చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన,

ఒక ప్రయోజనం వున్న, ఒక గొప్ప ఆట.

మనం శరీరాలం కాదు ‘ ఆత్మలం ’ అని తెలుసుకోవడమే సత్యం.

అర్జునుడు శరీర తత్త్వానికి ప్రతీక … ‘ నర ’ తత్త్వానికి ప్రతీక.

శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైనవారు ఆత్మతత్త్వానికి ప్రతీకలు …

నారాయణ తత్త్వానికి ప్రతీకలు.

నరుడు “ నారాయణుడు ” కావాలి.

“ నరుడు ‘ నారాయణుడు ’గా ఎలా అవుతాడు? ” అంటే …

ధ్యానం చేసి … ధ్యాన యోగం చేసి … ధ్యానాభ్యాసం చేసి.

Pyramid Spiritual Societies Movement అన్నది ఈ ప్రపంచంలో

క్రూరమానవులుగా వున్నవారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు,

దుష్కృతాలన్నీ అంతం చేసేందుకూ ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోద్యమం.

పిరమిడ్ మాస్టర్లు ఊరూరా … వాడ వాడలా తిరిగి …

అందరికీ ధ్యానం నేర్పిస్తూ …

ప్రతి నరుడూ ఒక “ నారాయణుడు ” కావాలని ప్రబోధిస్తున్నారు.