భగవద్గీత 4-7

“ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || ”

పదచ్ఛేదం

యదా – యదా – హి – ధర్మస్య – గ్లానిః – భవతి – భారత – అభ్యుత్థానం – అధర్మస్య – తదా – ఆత్మానం – సృజామి – అహం

ప్రతిపదార్థం

భారత = భరత వంశీయుడైన అర్జునా ; యదా యదా = ఎప్పుడెప్పుడైతే ; ధర్మస్య = ధర్మానికి ; గ్లానిః = హాని ; అధర్మస్య = అధర్మానికి ; అభ్యుత్థానమ్ = వృద్ధి ; భవతి = అవుతుందో ; తదా హి = అప్పుడప్పుడంతా ; అహం = నేను ; ఆత్మానం = నన్ను ; సృజామి = సృష్టించుకుంటూ ఉంటాను

తాత్పర్యం

“ ఓ భరత వంశీయుడా, అర్జునా, ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. ”

వివరణ

ఏదేని ఒకానొక “ సాధారణ, సగటు ఆత్మ ” తన స్వంత ప్రగతి కోసం …

తన ఆత్మ పురోభివృద్ధి కోసం … మాత్రమే

తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది.

అయితే “ ఒకానొక సగటు ఆత్మ ” అనేకానేక జన్మల తన పరిణామక్రమంలో

తన స్వంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తరువాత …

ఒకానొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు …

ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు.

అప్పుడు … ఆ పరమాత్మ స్థితిలో… లోకకళ్యాణం కోసం …

అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది.

అటువంటి ఒకానొక పరమాత్మే శ్రీకృష్ణులవారు …

ఆయన్ని ఆయనే సృష్టించుకున్నారు. 

“ ఎప్పుడు ? ” అంటే …

అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు,

అందరూ సత్యం మరచిపోయినప్పుడు.

“ ఎందుకు ? ” అంటే …

ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు,

తద్ద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు …

వేదవ్యాసుడు, ఏసుప్రభువు, గౌతమబుద్ధుడు, వర్థమాన మహావీరుడు …

ఇలా ఎందరో, ఎందరో పరమ ఆత్మలు …

అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు.

“ పరమ ఆత్మ ” అంటే “ పరమ స్థితికి చేరుకున్న ఆత్మ ”.

తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన స్వంత ఆత్మ పురోభివృద్ధి కోసం …

పూర్తిగా మన స్వంత ఇచ్ఛానుసారమే …

మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము.

పుట్టేముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకుని పుడతాం.

ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకుని …

ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకుని … పుడతాం.

గుర్తుంచుకుందాం …

ఇదే … ఆధ్యాత్మిక శాస్త్రంలోని … స్పిరిచ్యువల్ సైన్స్లోని … అత్యంత ముఖ్య సూత్రం !

ఈ జీవితరంగం అనే నాటకరంగంలోకి … ఈ కర్మక్షేత్రంలోకి …

ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు …

ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు !

ఇదే మొట్టమొదటి సూత్రం …

ఇదే మధ్యలోని సూత్రం …

ఇదే ఆఖరి, చిట్టచివరి సూత్రం కూడానూ !