భగవద్గీత 2-41

“ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన  |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ || ”

 

పదచ్ఛేదం

వ్యవసాయాత్మికా – బుద్ధిః – ఏకా – ఇహ – కురునందన – బహుశాఖాః – హి – అనంతాః – చ – బుద్ధయః – అవ్యవసాయినాం

ప్రతిపదార్థం

కురునందన = ఓ అర్జునా ; ఇహ = ఈ యోగంలో ; వ్యవసాయాత్మికా = నిశ్చయాత్మకమైన ; బుద్ధిః = బుద్ధి ; ఏకా (భవతి) = ఒక్కటే ఉంటుంది ; అవ్యవసాయినాం = (కానీ) స్థిరబుద్ధి లేనివారి యొక్క ; బుద్ధయః = బుద్ధులు ; హి = నిశ్చయంగా ; బహుశాఖాః = అనేక విధాలుగా ; చ = మరి ; అనంతాః = అంతులేని (కోరికలుగల)వై(ఉంటాయి)

తాత్పర్యం

“ అర్జునా ! ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏక కారణంగా ఉంటుంది; నిశ్చయ వివేకం లేనివారి జ్ఞానం అనేక విధాలుగా అనంత ముఖాలుగా వుంటుంది. ”

వివరణ

ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే …

అంత ఫలితం తప్పకుండా ఉంటుంది.

ఈ యోగాన్ని ఆచరించాలంటే కావలసింది

స్థిరమైన, నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే !

స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించి అనేకంగా ఉంటాయి.

పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే

మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తుంది.

లక్ష్యం నిర్ణయించుకుని …

నిశ్చయాత్మకమైన, స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే …

లక్ష్యసాధనలో విజయం సిద్ధిస్తుంది.

నియంత్రించబడని, నిగ్రహించబడని మనస్సు 

పరిపరి విధాల పరుగులు పెడుతూ వుంటుంది.

నియంత్రించబడిన, నిగ్రహించబడిన మనస్సు “ బుద్ధి ” అనబడుతుంది.

అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది.

స్థిరమైన, నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగసాధన …

స్వల్పమైనా మహాభయం నుంచి రక్షిస్తుంది.