భగవద్గీత 2-19

 

“ య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |

ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || ”

 

పదచ్ఛేదం

యః – ఏనం – వేత్తి – హంతారం – యః – చ – ఏనం – మన్యతే – హతం – ఉభౌ – తౌ – న – విజానీతః – న – అయం – హంతి – న – హన్యతే

ప్రతిపదార్థం

యః = ఎవడైతే ; ఏనం = దీనిని (ఈ ఆత్మను) ; హంతారం = చంపేదానిగా ; వేత్తి=భావిస్తాడో ; చ = అలాగే ;యః = ఎవడయితే ; ఏనం = దీనిని(ఆత్మను) ; హతం = చంపబడినదానిగా ; మన్యతే = భావిస్తాడో ; తౌ, ఉభౌ = ఆ, ఉభయులూ ; న, విజానీతః = తెలిసినవారు(జ్ఞానులు) కారు ; అయం = ఇది (ఈ ఆత్మ) ; న, హంతి = (ఎవ్వరినీ) చంపదు ; న, హన్యతే = (ఎవ్వరి చేత) చంపబడదు

తాత్పర్యం

“ ఈ ఆత్మను చంపేదానిగా గానీ, చంపబడిన దానిగా గానీ భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే … ఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ”

వివరణ

“ మనం శరీరం కాదు … ఆత్మ ;

శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు …

ఆత్మ అన్నదే కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ;

ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది …

ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది ;

మనం ఎన్నెన్నో జన్మలను తీసుకుని ఉన్నాం …

మరి తీసుకున్న జన్మలన్నిటి నుంచీ నిష్క్రమించి ఉన్నాం.

ఆత్మ అన్నది చంపదు … చంపబడదు. ”

ఇదే తెలుసుకోవలసిన జ్ఞానం … ఆత్మజ్ఞానం.

దీనిని స్వానుభవంలో గ్రహించిన వాడు జ్ఞాని …

తెలుసుకోలేని వాడు అజ్ఞాని.

అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా గాని …

చంపబడేదానిగా గాని భావిస్తాడు.