భగవద్గీత 2-11

       “ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

        గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || ”

 

పదచ్ఛేదం

అశోచ్యాన్ – అన్వశోచః – త్వం –  ప్రజ్ఞావాదాన్ – చ – భాషసే – గతాసూన్ – అగతాసూన్ – చ – న – అనుశోచంతి – పండితాః

ప్రతిపదార్థం

త్వం = నువ్వు ; అశోచ్యాన్ = శోకింపదగనివారిని గురించి ; అన్వశోచః = శోకిస్తున్నావు ; చ = అంతేకాక ; ప్రజ్ఞావాదాన్ = ప్రజ్ఞావంతులలాగా ; భాషసే (య) = మాటలాడుతున్నావు (కానీ) ; గతాసూన్ = మరణించిన వారి గురించి; చ = మరి ; అగతాసూన్ = బ్రతికి ఉన్న వారిని గురించి ;  పండితాః = ఆత్మజ్ఞానం పొందినవారు ;  న అనుశోచంతి = దుఃఖించరు

తాత్పర్యం

“ దేని కోసం దుఃఖించకూడదో, దానికోసం దుఃఖిస్తూ … పై పెచ్చు పెద్ద ఆరిందాలా మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి గానీ, విగత జీవుల గురించి గానీ ఏమాత్రం దుఃఖించరు సుమా ! ”

వివరణ

“ ప్రజ్ఞ ”, “ శోకం ” అనేవి రెండూ పరస్పర విరుద్ధ అంశాలు …

రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు.

ప్రజ్ఞ కలిగినవాడు “ పండితుడు ”.

‘ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ చనిపోయే వాడే ‘ …

అన్న సత్యం పండితుడికి తెలుసు.

ఒకానొక చనిపోయినవాడి కోసం గానీ,

ఒకానొక చనిపోబోయేవాడి కోసం గానీ … అంటే …

ఉన్నవాడిని గురించి కానీ, పోయినవాడిని గురించి కానీ …

“ పండితుడు ” ఎప్పుడూ శోకించడు.

పండితుడు దేనికీ ఏడవడు …

ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతూంటాడు.

వదనంలో విషాధ ఛాయలు కూడా ఉండవు …

ఎప్పుడూ ఆనందమే ఆనందం !

అర్జునుడు ఒక ప్రక్కన తన

బంధువులు, గురువులు

యుద్ధంలో చనిపోతారు అని ఏడుస్తున్నాడు.

ఇంకొక ప్రక్కన “ రక్తపాతం ఎందుకు

చెయ్యాలి? ” అనీ, 

“ భిక్షాటన చేసి బ్రతుకుతాను ” అనీ …

గొప్పగొప్ప మాటలు మాట్లాడుతున్నాడు.

అంటే ఒక ప్రక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు …

ఇంకొక ప్రక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు

దేనికైనా ఏడ్చేవాడు “ పామరుడు ”

దేనికీ ఏడవనివాడే “ పండితుడు ”

“ పండితుడు ” అంటే అత్మశాస్త్రం అవగతమయినవాడు.

“ పామరుడు ” అంటే ఆత్మశాస్త్రం ఎంతమాత్రం అవగతం కానివాడు.