భగవద్గీత 6-13

“ సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |      

సంప్రేక్ష్యనాసికాగ్రంస్వందిశశ్చానవలోకయన్|| ”

పదచ్ఛేదం

సమం – కాయశిరోగ్రీవం – ధారయన్ – అచలం – స్థిరః – సంప్రేక్ష్య – నాసికాగ్రం – స్వం – దిశః – చ – అనవలోకయన్

ప్రతిపదార్థం

కాయశిరోగ్రీవం = శరీరాన్నీ, శిరస్సునూ, మెడనూ ; సమం = ఒకటే విధంగా ; అచలం = నిశ్చలంగా ; ధారయన్ = ఉంచి ; చ = మరి ; స్థిరః = స్థిరంగా వుండి ; స్వం, నాసికాగ్రమ్ = తన నాసికాగ్రంపై ; సంప్రేక్ష్య = దృష్టిని ఉంచి ; దిశః, అనవలోకయన్ = దిక్కులను చూడకుండా వుండాలి.

తాత్పర్యం

“ శరీరం, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి, దిక్కులు చూడక, నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ”

వివరణ

వీలైనంత స్థిరంగా … ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా … కూర్చుని,

ఆ స్థితినే ధ్యానం పూర్తి అయ్యేవరకు కొనసాగించాలి.

అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటే, ఏకాగ్రత కుదరదు …

మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది …

కనుక కళ్ళు రెండూ మూసుకోవాలి.

తరువాత “ నాసికాగ్రం ” మీద దృష్టిని నిలపాలి.

“ నాసికాగ్రం ” అంటే రెండు కనుబొమ్మల మధ్య గల “ భ్రూమధ్యం ”.

అంతేకానీ ముక్కుపుటాల దగ్గరి చివరి భాగం కాదు !

దృష్టిని … అంటే అంతర్దృష్టిని … భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి.

ఇక “ సమం కాయశిరోగ్రీవం ” అంటే అసలు అర్థం తెలుసుకుందాం …

“ కాయం ” = కర్మలు

“ శిరం ” = ఆలోచనలు

“ గ్రీవం ” = వాక్కులు

“ సమం కాయశిరోగ్రీవం ” అంటే “ కర్మలు, ఆలోచనలు, వాక్కులు ‘ సమం ’ చేయబడాలి ” …  అంటే “ త్రికరణశుద్ధి ” అన్నమాట !

“ చేసే పని ఒకటి, మాటలాడే మాట ఇంకొకటి, ఆలోచించే ఆలోచన వేరొకటి ” అన్న స్థితి వుండరాదు !

“ త్రికరణ శుద్ధి ” ఉన్నవాడికే ధ్యానయోగాభ్యాసం లభ్యమయ్యేది.

“ సమం కాయశిరోగ్రీవం ” అంటే

“ మొండాన్నీ, తలనూ, కంఠాన్నీ నిటారుగా పెట్టడం ” అన్నది కానే కాదు !

అలా పెట్టడం చాలా అసౌకర్యదాయకం కూడా!

అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది

సుఖవంతమైన ధ్యానాభ్యాసానికి ఎంతమాత్రం దారితీయదు !

“ సుఖమయ ఆసనం ” మరి “ సుఖమయ ప్రాణాయామం ” అన్నవే …

సుఖమయ ధ్యానానికి మౌలిక హేతువులు.