భగవద్గీత 3-25

“ సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |

కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ||

 

పదచ్ఛేదం

సక్తాః – కర్మణి – అవిద్వాంసః – యథా – కుర్వంతి – భారత – కుర్యాత్ – విద్వాన్ – తథా – అసక్తః – చికీర్షుః – లోకసంగ్రహం

ప్రతిపదార్థం

భారత = ఓ అర్జునా ; కర్మణి, సక్తాః = కర్మలలో ఆసక్తులైన ; అవిద్వాంసః = అజ్ఞానులు ; యథా = ఎట్లా ; కుర్వంతి = (కర్మలను) ఆచరిస్తున్నారో ; అసక్తః = ఫలాసక్తిలేని ; విద్వాన్ = జ్ఞాని ; లోకసంగ్రహం = లోకహితాన్ని ; చికీర్షుః = చేయగోరేవాడు కూడా ; తథా = అలాగే ; కుర్యాత్ = (కర్మలను) ఆచరించాలి.

తాత్పర్యం

“కాబట్టి, ఓ అర్జునా, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే, జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా లోకహితం కోసం … చేయవలసిన కర్మలను చేస్తూనే వుండాలి.”

వివరణ

జ్ఞాని అయినా … అజ్ఞాని అయినా …

చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి.

ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే … కర్మాచరణలోనే ఉంది.

చేయవలసినది ‘ కామ్య కర్మ ’ కాదు … ‘ నిష్కామ కర్మ ’.

చేయవలసినది ‘ కర్మ త్యాగం ’ కాదు … ‘ కర్మ ఫల త్యాగం ’.

ఇది తెలియని అజ్ఞాని ‘ జనన మరణ చక్రం ’ లో బంధించబడుతూ ఉన్నాడు.

ఇది తెలిసిన జ్ఞాని ‘ జనన మరణ చక్రం ’ నుండి విముక్తుడు అవుతున్నాడు.