సంకల్పశక్తి

 

ఈ సకలచరాచర సృష్టిలో కేవలం మనం మాత్రమే ఇతర జంతుజాలానికంటే పరిణామక్రమంలో వున్నతమైన స్థానంలో వున్నాం. దానికి కారణం కేవలం మనకు ఉన్న “ఆలోచన శక్తి” మాత్రమే.

సృష్టియొక్క ఆకర్షణా సిద్ధాంతాన్ని అనుసరించి .. మన జీవితంలో సంభవించే ప్రతిఒక్క సంఘటన కూడా తనదైన ఒకానొక చైతన్య శక్తితరంగాన్ని కలిగివుంటుంది. ప్రతిరోజూ మనం పొందుతోన్న అనుభవజ్ఞానం ఆధారంగా మనం చేసే ఆలోచనలను అనుసరించి అది వివిధ స్థాయిలుగా రూపాంతరం చెందుతూ వుంటుంది. ఇలా అనేకానేక సంఘటనల సమాహారం అయిన మన జీవితం అంతా కూడా మనం చేసే ఆలోచనల మీదే ఆధారపడి వుంది అన్న విషయాలను మనకు విస్తారంగా తెలియజేసేదే ” ఆలోచనాశాస్త్రం. “

ఎప్పుడయితే మనం ఈ “ఆలోచనాశాస్త్రం” యొక్క తీరుతెన్నులను చక్కగా అవగాహన చేసుకుంటామో .. అప్పుడే మనం “సంకల్పశాస్త్రం” లో కూడా నిష్ణాతులం అవుతాం మరి మన జీవితాలను మనమే నవ్యమైన రీతిలో నడుపుకోగలుగుతాము. మన సంకల్పశక్తిని బట్టే మన చుట్టూ ఉన్న వాతావరణం యొక్క శక్తి కూడా ఆధారపడి వుంటుంది కనుక మనచుట్టూ వున్న ప్రపంచంలో మనం కూడా హాయిగా బ్రతకాలంటే .. మనం మన సంకల్పశక్తి గురించి విస్తారంగా తెలుసుకోవాలి.

“ఆలోచనాశాస్త్రం”

 

సాధారణంగా మనం మన మానసిక ప్రపంచంలో సృష్టించుకునే ఏదేని ఒక ఆలోచన .. భౌతిక ప్రపంచంలో కార్యరూపం దాల్చే లోపు అది ద్వంద్వపూరిత ఘర్షణకు గురి అవుతుంది. ఆ ఘర్షణ యొక్క ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి తరంగాలు మన చుట్టూ వున్న వాతావరణంపై తమ ప్రభావాన్ని చూపిస్తూ .. వాటి వాటి శక్తితరంగ స్థాయిలను అనుసరించి బయటి ప్రపంచంలో రకరకాల వాస్తవాలను సృష్టిస్తూంటాయి.

ఇలా మన ఆలోచన అన్నదే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సకల వాస్తవాలను సృష్టిస్తూంటుంది కనుక .. ” పైన ఆకాశంలో వున్న ఏ దేవుడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు” అన్న అపోహలోంచి ముందు మనం బయటపడాలి. మన  “ఆలోచనల ఎంపిక” లో అత్యంత శాస్త్రీయతతో కూడిన జాగరూకతను మనం కలిగి వుంటూంటే .. మన వాస్తవాలు కూడా అంతే నాణ్యతను సంతరించుకుంటూ వుంటాయి అన్న సంగతిని గ్రహించాలి.

ఉదాహరణకు .. మనం ఒకానొక గొప్ప సంగీతజ్ఞుడి కచేరీకి వెళ్ళి చక్కగా అతడి పాటలను ఆస్వాదించాం అనుకుందాం. అప్పుడు మనకు “నేను కూడా అలా అద్భుతంగా పాడితే ఎంత బాగుంటుంది. “అన్న ఆలోచన వస్తుంది. హృదయానికి హత్తుకుపోయిన ఆ సంగీత కార్యక్రమం పట్ల పదే పదే ప్రభావితమైన మన ఆలోచన .. పదే పదే మన మనస్సు లోని చైతన్యాన్ని తట్టి లేపుతూ వుంటుంది. అప్పుడు అది ఒక గొప్ప  “కోరిక” గా రూపుదిద్దుకుని ఇక మనల్ని నిలువనియ్యకుండా కూర్చోనియ్యకుండా, మన అంతరంగాన్ని సంగీతం నేర్చుకునేలా ఉత్సాహపరుస్తూనే వుంటుంది. ఇలా మన ” ఆలోచనాశక్తి ” ఎంతగా బలోపేతమవుతూ వుంటే .. అంతగా మనకు సంగీతం నేర్పేవారో, సంగీత సాధన చేసేవారో ఎదురవుతూనే ఉంటారు.

అలాగే ఏదేని ఒక ఆట గురించి కూడా పదే పదే ఆ ఆటకు సంబంధించిన ఆలోచనను మనస్సులోకి తెచ్చుకుంటూంటే ఆలోచన మరింత మరింతగా బలం పుంజుకుని శక్తివంతం అవుతూ “ఇష్టం” గా మారి ఏదో ఒకనాటికి మనల్ని ఒక గొప్ప ఆటగాడిగా నిలబెడుతుంది.

ఆధ్యాత్మికతకు సంబంధించి కూడా అంతే. “జీసస్ క్రైస్ట్” ప్రవచనాలను వింటూన్నప్పుడు ఆ సమస్త జ్ఞానం అంతా కూడా మన మనస్సులో నిండిపోయిందనుకోండి. అప్పుడు మనకు కూడా “జీసస్ లాగానే ఉండిపోవాలి” అనిపిస్తుంది. దాంతో మనం ఏసుక్రీస్తు యొక్క దివ్యలక్షణాలైన దయ, కరుణలతో కూడిన సమూహాలతో తిరుగుతూ వారినుంచి జ్ఞానాన్ని పొందుతూంటాం. ఏసుక్రీస్తు లాగే ధ్యానం చేస్తూ ఆయనలాగే దేవుని రాజ్యంలోకి ప్రవేశించి పునీతులమవుతూంటాం. ఇలా మొక్కవోని దీక్షతో సాధన చేస్తూంటే .. క్రమక్రమంగా మనం కూడా ఖచ్చితంగా ఏసుక్రీస్తులాగే పరిమారిపోతాం.

“కపిలవస్తు” రాజకుమారుడైన గౌతమబుద్ధుడు అప్పటి వరకు సమస్తరాజ భోగాలను అనుభవిస్తూ కూడా రాజభవనం నుంచి బయటకు రాగానే .. దుఃఖాన్నీ, బాధనూ చూసి విచలిత మనస్కుడయ్యాడు. “అసలు ఈ దుఃఖానికి మూలకారణం ఏమిటి ; దీని నుంచి నా ప్రజలను ఎలా విముక్తులను చెయ్యాలి ” అన్న ఆలోచన అతని మనస్సులో మొదలైంది.

ఇక దాంతో అతడు అంతవరకూ తాను అనుభవిస్తోన్న సకల రాజభోగాలను తృణప్రాయంగా వదిలి పెట్టేసి .. తన మనస్సులోని దృఢమైన ఆలోచనను అనుసరిస్తూ వెళ్ళి .. తనలాగే సత్యాన్వేషణలో నిమగ్నమై ఉన్న ఎందరెందరో గురువులను కలిసాడు. వారితో సహవాసం నెరపి వాళ్ళ దగ్గరినుంచి ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకుని .. దానిని సాధన చేసి తన అనుభవజ్ఞానంలా మలచుకున్నాడు. ఆ సాధనా క్రమంలోనే అతడు ఎన్నెన్నో విశ్వరహస్యాలను ఛేధించాడు.

సంకల్పం మాత్రం చేతనే మానవులంతా కర్మపరంపరలో మరి జన్మపరంపర లో పడి ఎలా కొట్టుకుపోతున్నారో తెలుసుకున్నాడు. సంకల్పానికి ఉన్న అనంత శక్తికి వున్న పరిధులను అవగాహన చేసుకున్నాడు. సంకల్పం యొక్క దిశను మార్చడం వల్ల మారిపోయే కార్యకారణ సిద్ధాంతం మరి పునర్జన్మ సిద్ధాంతాల బృహత్ స్వరూపాలను అర్థం చేసుకున్నాడు. ఈ దివ్యప్రణాళికను అంతా వివరణాత్మకంగా అవగాహన చేసుకుని దివ్యజ్ఞాన ప్రకాశంతో నిండిపోయిన బుద్ధడయ్యాడు.

గౌతముడు రాజభవనంలో ఉన్నంతసేపు అతడు ఏ జన్మకారణంతో పుట్టాడో దానిని కనీసం తలపునకు కూడా తెచ్చుకోలేకపోయాడు. కానీ ఎప్పుడయితే అతడు తన రాజభోగాల ‘మాయ’ ను ఛేధించుకుని బయటికి వచ్చాడో .. అప్పుడు తనకు కావలసినవన్నింటినీ కూడా అతి తక్కువ సమయంలోనే పొంది తన జన్మను సార్థకం చేసుకుని .. లోకానికంతటికీ మార్గదర్శనం చేసి బుద్ధుడయ్యాడు.

కాబట్టి మన సంకల్పశక్తి ఎంత బలీయంగా ఉంటే, ఎంత అంకితభావంతో కూడుకుని వుంటే అంత ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యానికి చేరుకుంటాం. దీనినే మనం నిర్ణయాత్మక శక్తితో కూడిన “సంకల్ప శుద్ధి” అంటాం.

కొన్నిసార్లు మనం ఏ ఆలోచన చేస్తామో .. దానికి పరస్పర విరుద్ధమైన అనేకానేక వికల్పాలు కూడా పుట్టుకుని వచ్చి .. మనం ముందుగా చేసిన ఆలోచనలను నిర్వీర్యం చేస్తూంటాయి. దీంతో మన మనస్సు అల్లకల్లోలానికి గురి అయ్యి .. మనల్ని అయోమయానికీ, అశాంతికీ గురిచేస్తుంది. దీనినే మనం “నకారాత్మక ఆలోచనా విధానం” అంటాం.

ఇలాంటి అశాంతిమయమైన ఆలోచనా విధానంలోంచి మనం బయటికి రావాలంటే మన ఆలోచనల పట్ల మనం విశేషమైన స్పష్టతను కలిగివుండాలి. అప్రయోజనకరమైన ఆలోచనల పట్ల ఉపేక్ష వహించగలగాలి. మన హృదయం సంపూర్ణంగా ఆమోదించిన ఆలోచననే మన మనస్సులో ధారణ చేయగలగాలి. వికల్పాలతో కూడిన సంకల్పాలు ఎన్నటికీ నెరవేరవు .. మరి అవి మన శక్తిని క్షీణింపజేసి మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ .. మన జీవితం మన చేతుల్లో లేకుండా చేస్తాయి. కనుక ఒక్క అడుగు ముందుకూ మరి నాలుగు అడుగులు వెనుకకూ వేసే వికల్పాలతో కూడిన ఆలోచనా విధానం వల్ల మనకు ఎంతమాత్రం మేలుచేకూరదు అన్న సంగతి తెలుసుకోవాలి.

మన పుట్టుకను కూడా మనం మన స్వ- ఇచ్ఛతో కూడిన సంకల్పం ద్వారానే ఎంచుకుని మరీ పుడ్తాం. మనకు ఎలాంటి దేహం కావాలో, ఎలాంటి సమాజంలో, కుటుంబంలో, ఎలాంటి తల్లితండ్రులకు మనం పుట్టాలో అన్నీ కూడా మన ఆలోచన ప్రకారమే సూక్ష్మలోకాల్లో సంకల్పించుకుని మనం పుడుతాం. ఆత్మపరిణామం కోసం “సరిక్రొత్త అనుభవాలను పొందడానికి ఇది వరకు జన్మలకంటే ఇదే సరి అయిన జన్మ” అని నిర్ణయించుకుని .. ఆ నిర్ణయానికి తగ్గట్లుగా భూలోకంలో కావలసిన పరిస్థితులనూ సహచరులను కూడా మన స్వ-ఇచ్ఛ ప్రకారమే ఎంపిక చేసుకుంటాం.

ఇలా పుట్టమని కూడా మనల్ని ఎవ్వరూ శాసించరు. కేవలం మనం సంపూర్ణ స్వంత ఇష్టం ప్రకారమే ఈ భూమ్మీద జన్మతీసుకుంటాం. ఈ భూమ్మీద ఇంతవరకు ఎవ్వరూ కూడా సంకల్పం లేకుండా స్వ-ఇచ్ఛతో కాకుండా ఒక తల్లి గర్భంలో జన్మతీసుకోవడం అన్నది జరగలేదు.. కానీ పుట్టాక ఇదంతా మరచిపోయి .. “నా జీవితం ఇలా తగలబడింది ; నాకు వీళ్ళు ఇంకా ఏదో చేయలేదు” అంటూ నెపాన్ని ఇతరుల మీదకు నెట్టుతూ అత్మజ్ఞానం లేని మూర్ఖుల్లా ప్రవర్తిస్తూంటాం.

“ఎప్పుడయితే ధ్యానం ద్వారా మనం మన అంతరంగాన్ని తరచి చూసుకుని .. ” మన దౌర్భాగ్యాన్నీ, మన దరిద్రాన్నీ, మన విషాదాలనూ మరి మన రోగగ్రస్త జీవితాలనూ మనమే సృష్టించుకున్నాం” అన్న ఎరుకను తెచ్చుకుంటామో .. అప్పుడే మనం అజ్ఞానం నుంచి శాస్త్రీయంగా బయటపడే జ్ఞానాన్ని పొందుతాం. కాబట్టి మన జీవితం యొక్క నాణ్యత, సమర్థత శాస్త్రీయత అన్నవి మన స్వ-ఇచ్ఛతో కూడిన సంకల్పశక్తి మీదనే ఆధారపడి వుంటాయి అన్నది మనం ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకోవాల్సిన సత్యం.

మనం మన జీవిత గమనంలో విజయాన్ని సాధించాం అంటే దానికి కారణం మన సంకల్పబలమే మరి మనం అక్కడ చావుదెబ్బ తిన్నాం అంటే దానికి కారణం కూడా అది మన సంకల్పబలహీనతే అన్నది పరమసత్యం మనిషి చంద్రమండలంపై కాలుపెడతానని కలగన్నామా ? అనంత మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాడని కలగన్నామా ? మనిషి ఒక చిన్ని మరపడవలో అట్లాంటిక్ మహాసముద్రం పై ఈ మూల నుంచి ఆ మూలకు ప్రయాణిస్తాడని అనుకున్నామా ? కానీ ఈ ఊహలన్నీ ఈ రోజు నిజం అయ్యయంటే దానికి కారణం ఆ పనిని నిజం చేసిన వాళ్ళ యొక్క మహాసంకల్ప బలమే. వాళ్ళ ఆలోచనల్లోని స్పష్టత మరి వాళ్ళ ఆలోచనలపై వాళ్ళకు ఉన్న పట్టు. ఆ పట్టుదలే .. వాళ్ళల్లో ఆ సంకల్పబలాన్ని పెంపొందింప చేసి .. అనుకున్న పనిని పూర్తిచేసేలా వాళ్ళకు కావాల్సిన శక్తిని కలుగజేసింది.

కాబట్టి మన సంకల్పశక్తితో మనం ఎంచుకున్న మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి అంటే మనలో ఉండవలసింది ఎంతోగొప్ప “సంకల్ప శుద్ధి”, “సంకల్ప శుద్ధి” వుంటేనే “సంకల్పశక్తి” వస్తుంది ; “సంకల్ప శక్తి” ఉంటేనే ” సంకల్పసిద్ధి ” మనకు కలుగుతుంది. జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి అవసరం అయ్యే ఇంతగొప్ప ” సంకల్ప శుద్ధీ ” గురించీ, “సంకల్పశక్తి” గురించీ మరి “సంకల్ప సిద్ధి” గురించీ పిల్లలకు చిన్నప్పటి నుంచే విస్తారంగా బోధించాలి. జన్మతీసుకున్న ప్రతిఒక్క జీవితం కూడా ఖచ్చితంగా సఫలీకృతం అయ్యేతీరాలి కనుక పిల్లలను “సంకల్పశుద్ధ మూర్తులు” గా తీర్చిదిద్దాలి. “ధ్యాన శాస్త్రాన్నీ” “ఆలోచనా తరంగాల శాస్త్రాన్నీ” వారిని ప్రయోగ పూర్వకంగా బోధించి వారిని “ధ్యానశాస్త్ర విద్యాపారంగతులు” గా చెయ్యాలి.

మనమనస్సులో పుట్టే ప్రతి సంకల్పం .. అది ప్రయోజనకరమైందా లేక అప్రయోజనకరమైందా అన్నది మన జన్మజన్మల సంస్కారం పైనా .. మన మనో నిబ్బరత పై ఆధారపడి వుంటుంది. కనుక దానికి వున్న ఒక శక్తి పరిధిని బట్టి మన ఆలోచనా విధానం నాలుగు రకాలుగా సాగుతూ వుంటుంది.

1. వినాశకరమైన సంకల్పాలు ; 2. నకారాత్మకమైన సంకల్పాలు ; 3. సకారాత్మకమైన సంకల్పాలు ; 4. అద్భుతమైన సంకల్పాలు

 

“వినాశకరమైన సంకల్పాలు”

 

మొట్టమొదటిసారిగా మనం ఒక మోటార్ సైకిల్ ను కొనుకున్నాం అనుకుందాం. దానిపై కూర్చుని “ఆక్సిడెంట్ ఖచ్చితంగా అవుతుంది ; ఫలానా వాళ్ళకు అలాగే జరిగింది” అనుకుని పదే పదే ఆక్సిడెంట్స్ జరిగిన వాళ్ళనే తలుచుకుంటూ .. ఆ సంఘటనలను గురించే భయపడుతూంటే అది మన సంకల్పానికి భయంకరమైన వినాశకరశక్తిని జోడించి అతి త్వరలోనే నిశ్చయంగా మనకు ప్రమాదం జరిగేట్లుగా చేస్తుంది. మనం ఏది కావాలని గాఢంగా కోరుకుంటామో దానిని మన ముందు సాక్షాత్కరింపచేసే “సూపర్ మేన్” లాంటి సంకల్పశక్తి మన మనస్సుకు ఉండడమే దానికి కారణం.

కాబట్టి చిన్నప్పటినుంచి పెద్దలు మనకు నూరిపోసిన “కీడెంచి మేలెంచాలి” అన్న మాటను మన మనస్సులోంచి వెంటనే తొలగించుకోవాలి. ఏది కావాలో దానినే స్పష్టంగా ఎంచుకునే మానసికాభ్యాసాన్ని చేయాలి.

 

“నకరాత్మక సంకల్పాలు”

 

 

“ఏమో, పరీక్ష వ్రాయడానికి వెళ్తున్నాను కానీ .. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, చదివినవన్నీ వస్తాయో లేదో” అంటూ అస్పష్టమైన డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆ వికల్పాలతో మన సంకల్పాలకు మనమే “నకారాత్మకశక్తి” ని జోడించేస్తుంటాం.

ఇలాంటి నకారాత్మక శక్తితో కూడిన “వికల్ప సహితసంకల్పాలు” మన ఆత్మాభివృద్ధికి ఎంతమాత్రం ప్రయోజనకరం కావు. దీనివల్ల .. క్షణక్షణం మనం ప్రమాదం అంచుల్లో జీవిస్తూ .. చావు తప్పికన్ను లొట్టపోయిన శక్తిహీనుల్లా మారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ ఉంటాం.

 

“సకారాత్మక సంకల్పాలు”

 

“నేను ఖచ్చితంగా విజయం సాధించే తీరుతాను” .. అది పరీక్షే కానీ లేదా మొట్టమొదటిసారి ఒక వాహనం నడపడమే కానీ, లేదా ధ్యానం చెయ్యడమే కానీ, “నేను తప్పకుండా చేసే తీరుతాను’ అన్న “వికల్పరహిత సంకల్పశుద్ధి” తో ముందుకు కదలడమే “సకారాత్మకమైన ఆలోచనా ధోరణి” .

ఇలా ధ్యానం ద్వారా మన మనస్సులో సకారాత్మక ఆలోచనా తరంగాలు సదా సుప్రతిష్ఠితమై వుండాలి. మనస్సును ఎంత శూన్యంగా వుంచుకుంటే మనస్సు యొక్క శక్తి అంత ఉధృతంగా వుంటుంది ; మనస్సును ఎంత పరిశూన్యంగా వుంచుకుంటే మన సంకల్పశక్తి అంత ప్రఛండంగా వుంటుంది. అవసరం అయితేనే మాట్లాడాలి కానీ అవసరం లేని మాటలను బొత్తిగా మాట్లాడకూడదు ; అవసరం లేని ఆలోచనలను మన మనస్సులో ఒక్క క్షణం కూడా చోటు ఇవ్వరాదు.

మనస్సుకు ఈ అభ్యాసం అలవడాలంటే మనం ఇతోధికంగా మౌనం పాటించాలి ; ఇతోధికంగా ధ్యానం చేయాలి ; ఇతోధికంగా ఎరుకతో జీవించాలి.

 

“అద్భుతమైన సంకల్పశక్తి “

 

“కొందరి జీవితాలు అస్తవ్యస్తంగానూ మరి కొందరి జీవితాలు సఫలంగా, విజయవంతంగా ఉన్నాయి” అంటే దానికి కారణం వారిలో భిన్నభిన్న మోతాదుల్లో వున్న సంకల్పశుద్ధి మాత్రమే. ఒక్కోసారి మనకు ” నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి ” అనీ, ఒక్కోసారి “నేను బుద్ధుడిగా కూడా కావాలి ” అనీ అనిపిస్తూ వుంటుంది. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన ఆలోచనలు.

బుద్ధుడిగా కావాలంటే రాజకీయాలు మరచిపోవాలి ; ప్రైమ్ మినిస్టర్ కావాలంటే బుద్ధత్వం గురించి మరచిపోవాలి ; పేరు ప్రతిష్టలూ మరి దాంతో పాటే దుఃఖరాహిత్యమూ కావాలి అంటే కుదరదు. ఆ రెండూ పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు మరి ఒకే జీవితం కాలంలో అవి సాధ్యం కావడం ఎంతో కష్టం, కాని సాధ్యం అయ్యేతీరాలి. కీర్తిప్రతిష్టలతో పాటే దుఃఖరాహిత్యాన్ని కూడా ఒకే జన్మలో సాధించడం కేవలం ఒకానొక యోగికి మాత్రమే సాధ్యం. అలాంటి ధ్యాన యోగంలోనే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి.

అందుకుగాను మనం ఇతోధికంగా ధ్యానశక్తిని పెంపొందించుకోవాలి. ప్రాపంచిక జీవితంలో ఉంటూనే బురదలో వికసించే పద్మంలా జీవించాలి. ప్రాపంచిక జీవితంతో ధ్యానాన్నీ, జ్ఞానాన్నీ ఐక్యం చేసి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లా మారి అత్యంత శాస్త్రీయతతో జీవిస్తూంటామో .. అప్పుడు మనం చేపట్టిన కార్యం ఏదైనా సరే శక్తివంతంగా మారి లోకకల్యాణ కార్యక్రమంగా రూపుదాల్చుతుంది. ఆత్మజ్ఞానం పట్ల ఏ మాత్రం అవగాహనలేకుండా కేవలం తిండీ, నిద్రలకే ప్రాముఖ్యతను ఇస్తూ, అశాశ్వతమైన లౌకిక సంపదలను కూడగట్టుకుంటూ తన స్వార్థం కోసమే బ్రతికే సగటు మానవుడికి ఇది అసాధ్యం అవుతూండవచ్చు .. కానీ ఆధ్యాత్మికతను సంతరించుకున్న వారికి మాత్రం అన్ని రంగాల్లో అఖండ విజయం సాధించడం చాలా తేలిక. కేవలం ఒకానొక “ధ్యానయోగి” మాత్రమే తన అఖండమైన సంకల్పశక్తితో, అద్భుతమైన సంకల్ప శుద్ధితో తన జీవితాన్ని విజయపథంవైపు అలవోకగా నడిపించుకుంటూ జీవించడంలోని ఆనందాన్ని ప్రతిక్షణం అనుభవిస్తూంటాడు.

 

 “సంకల్ప శక్తికి అవధులు లేవు” 

 

ఇలా నిరంతర ధ్యాన-జ్ఞాన సాధనల ద్వారా తమ సంకల్పాలను పరిశుద్ధం చేసుకున్న వారే .. పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం ద్వారా తమను తాము పరిశుద్ధ ఆత్మలుగా ధ్యానశాస్త్రజ్ఞులుగా రూపుదిద్దుకున్న వీరు ధ్యానప్రచారం ద్వారా లోకకల్యాణం అనే అఖండ సంకల్పానికి నడుం బిగించారు. ప్రతి ఒక్కరిలోని ఆత్మశక్తిని తట్టిలేపుతూ “నువ్వు ఏమైనా చెయ్యగలవు” అంటూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ” ఏమైనా చెయ్యగలను ” అన్న ఆలోచనే సరియైన ఆలోచన. ఆ ఆలోచననే మనల్నీ మరి మనతో పాటు ఈ లోకాన్నీ పటిష్టం చేస్తూ .. మనల్ని విశ్వంతో అనుసంధానం చేస్తుంది.

కాబట్టి మన వాస్తవాలకు మనమే “సృష్టి కారకులం”, “స్థితి కారకులం” మరి “లయ కారకులం” అన్న సత్యాన్ని సదా ఎరుకలో ఉంచుకోవాలి ; ధ్యానశక్తి మరి జ్ఞానశక్తితో కూడిన అద్భుతమైన సంకల్పశక్తితో మన భౌతిక మరి ఆధ్యాత్మిక జీవితాలకు చెందిన విజయాలను ఈ జన్మలోనే అలవోకగా కైవసం చేసుకోవాలి ; అప్పుడే మనం మన జీవితాలను ధన్యత చెందించుకుంటాం.