భగవద్గీత 6-11

“ శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |        

నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || ”

పదచ్ఛేదం

శుచౌ – దేశే – ప్రతిష్ఠాప్య – స్థిరం – ఆసనం – ఆత్మనః – న – అత్యుచ్ఛ్రితం – న – అతినీచం – చైలాజినకుశోత్తరం

ప్రతిపదార్థం

శుచౌ, దేశే = పరిశుభ్రమైన ప్రదేశంలో ; చైలాజినకుశోత్తరం = దర్భాసనం, జింకచర్మం, వస్త్రం ఒకదానిపై ఒకటి వేసి ; న, అత్యుచ్ఛ్రితం = ఎక్కువ ఎత్తుగా లేని ; న, అతి నీచం = ఎక్కువ పొట్టిగా లేని ; ఆత్మనః, ఆసనం = తనకు ఆసనాన్ని ; స్థిరం = స్థిరంగా ; ప్రతిష్ఠాప్య = ఏర్పరచుకుని

తాత్పర్యం

“ ఎక్కువ ఎత్తుగాకానీ, మరీ తక్కువగాకానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భలు, జింక చర్మం, వస్త్రం వరుసగా పరచుకుని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ”

వివరణ

ధ్యానయోగసాధన కోసం ఎంచుకున్న ప్రదేశం …

పరిశుభ్రమైనదిగా, ప్రశాంతమైనదిగా ఉండాలి …

మరీ ఎత్తుగా ఉంటే క్రింద పడే అవకాశం ఉంటుంది.

అదే మరీ పల్లంగా ఉంటే భూశీతోష్ణస్థితులు, క్రిమికీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు.

అంత ఎత్తుగాగానీ, మరీ పల్లంగా గానీ కాకుండా …

కూర్చోడానికి అనుకూలమైన …

కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

పూర్వపు రోజుల్లో దర్భాసనం, జింకచర్మం, వస్త్రం ఇత్యాది పరచుకుని

మెత్తగా, సౌకర్యంగా చేసుకునేవారు.

ప్రస్తుతం మనం కుర్చీలను గానీ, సోఫాలను గానీ ఉపయోగించుకుంటాం.

వెరసి ఎక్కువసేపు సౌకర్యవంతంగా … స్థిరంగా … సుఖంగా …

ఉండే విధంగా కూర్చోవాలి.

పతంజలి మహర్షి “ స్థిర సుఖం ఆసనం ” అన్నారు కదా !

పతంజలిమహర్షి