భగవద్గీత 4-11

“ యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || ”

 

పదచ్ఛేదం

యే – యథా – మాం – ప్రపద్యంతే – తాన్ – తథా – ఏవ – భజామి – అహం – మమ – వర్త్మ – అనువర్తంతే – మనుష్యాః – పార్థ – సర్వశః

ప్రతిపదార్థం

పార్థ = ఓ పార్థా ; యే = ఎవరు ; మాం = నన్ను ; యథా, ప్రపద్యంతే = ఎలా సేవిస్తారో ; అహం = నేను ; తాన్ = వారిని ; తథా, ఏవ = అదే విధంగా ; భజామి = అనుగ్రహిస్తాను ; మనుష్యాః = మనుష్యులు ; సర్వశః = అన్ని విధాలుగా ; ‘మమ ’ = ‘ నా యొక్క ’ ; వర్త్మ = మార్గాన్నే ; అనువర్తంతే = అనుసరిస్తారు.

భగవాన్ ఉవాచ — ధ్యాన ఉవాచ :

“ ఎవరు ఏవిధంగా ‘ నన్ను ’ సేవిస్తే వాళ్ళని ఆవిధంగానే ‘ నేను ’ అనుగ్రహిస్తున్నాను. మానవులు అందరూ ఎప్పుడూ ‘ నా ’ మార్గాన్నే అనుసరిస్తున్నారు. ”

వివరణ

“ శ్రీకృష్ణుడు ” అంటే “ ధ్యానం” అని మనం పదే పదే గుర్తుంచుకోవాలి.

నేను = ధ్యానం

అర్జునుడు = ధ్యానం తెలియని తత్వం

శ్రీకృష్ణుడు = ధ్యానం అనే తత్వం

ఈ శ్లోకంలో “ నేను ” అన్నప్పుడల్లా “ ధ్యానం ” అని అర్థం చేసుకోవాలి.

“ ఎవరు ఏవిధంగా నన్ను (ధ్యానాన్ని) సేవించినా, వాళ్ళని నేను …

(ధ్యానం) ఆ విధంగా అనుగ్రహిస్తాను. ”

కృష్ణుడిలా అంతా ధ్యానయోగ సిద్ధాంతాన్ని

ఆకళింపు చేసుకుని ఆచరిస్తే మనమూ

ధ్యానయోగులుగా ఎదుగుతాం.

అందుకని – కృష్ణుడిని అంటే ధ్యానాన్ని

మనం ఏవిధంగా చూడాలన్నది మనమే

నిర్ణయించుకోవాలి.

మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం

చేసుకుంటాం.

మనం జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర

చేసుకుంటాం.

మనల్ని మనం రాయికీ, రప్పకూ మ్రొక్కుతూ …

కోరికలు తీర్చమని దేముడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే …

ఎదగకుండా అలాగే ఉంటాం !

అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నమైన ఆత్మగా గ్రహించి …

ధ్యాన సాధన చేస్తే … ఆత్మ తత్త్వాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానిగా మారుతాం !

“ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం ”

కానీ ఎవరు ఏమార్గంలో ప్రయాణించినా … ఎన్ని జన్మలు గడిచినా … చివరికి అందరూ తన …

ధ్యాన మార్గాన్నే అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణపరమాత్మ.

వేరే దారి లేదు మరి !

మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావలసిందే …

ధ్యాన సాధన చెయ్యవలసిందే …

‘ తాను ఆత్మను ’ అని గ్రహించవలసిందే !

లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు !