భగవద్గీత 6-17

“ యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || ”

 

పదచ్ఛేదం

యుక్తాహారవిహారస్య – యుక్తచేష్టస్య – కర్మసు – యుక్తస్వప్నావబోధస్య – యోగః – భవతి – దుఃఖహా

ప్రతిపదార్థం

యుక్తాహారవిహారస్య = యుక్తమైన ఆహార విహారాలు గలవాడు ;

కర్మసు = కర్మాచరణలో ; యుక్తచేష్టస్య = యుక్తంగాప్రవర్తించేవాడు ; యుక్తస్వప్నావబోధస్య = నిద్ర, మెలకువలలో యుక్తంగా ఉండేవాడు ; దుఃఖహా = దుఃఖాన్ని నాశనం చేసే ; యోగః = ధ్యానయోగం ; భవతి = సిద్ధిస్తుంది

తాత్పర్యం

“ యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి వున్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది. ”

వివరణ

ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్త్వికాహారం.

ఇది ఆయువునూ, బలాన్నీ, ఆరోగ్యాన్నీ, సుఖాన్నీ వృద్ధిచేస్తుంది.

ఎక్కువుగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువుగా తిని ఆకలితోనూ బాధపడక

అవసరానికి అనుగుణంగా “ యుక్తమైన ఆహారం ” … మితంగా తీసుకోవాలి.

“ యుక్తాహారం ” అంటే శాకాహారం …

 “ యుక్తాహారం ” అంటే సాత్విక

ఆహారం …

“ శ్రేష్ఠమైన యుక్తాహారం ” అంటే

“ ఫలాహారం ”.

ఆకలి ఉన్నప్పుడే తినాలి …

ఆకలి ఎంతవుందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి …

వారానికి ఒకరోజు నిరాహారిగా వుండాలి … అంటే ఉపవాసం వుండాలి …

“ లంఖణం పరమౌషధం ” కదా !

ఇకపోతే “ స్వప్నం ” అంటే “ నిద్ర ” … మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగా “ సరి అయిన నిద్ర ” నిద్రించాలి.

“ యోగంతో కూడుకున్న నిద్ర ” … “ యోగనిద్ర ” … “ సరి అయిన నిద్ర ”.

మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మంగా …

ధర్మయుక్తంగా ఉండాలి.

“ యుక్త విహారం ” చెయ్యాలి.

ప్రక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు …

ప్రక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే …

అది “ యుక్త విహారం ” అవుతుంది.

కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు.

మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగానూ …

ఇంకా తోడ్పడేవిగానూ ఉండాలే కానీ …

ఉద్రేకాలను ప్రకోపింప చేసేవిగా ఉండకూడదు.

అదే విధంగా … మనం సరియైన జ్ఞానాన్ని … అంతే అవబోధను … సంపాదించాలి.

తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరియైన జ్ఞానం, సరియైన అవబోధ.

ఈ విధమైన “ యుక్త యోగం ” ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది.

దుఃఖం హరించడానికే యోగసాధన చేయాలి … యోగసిద్ధి పొందాలి.