భగవద్గీత 3-7

“ యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేஉర్జున |

కర్మేంద్రియైః కర్మయోగ మసక్తః స విశిష్యతే || ”

 

పదచ్ఛేదం

యఃతు – ఇంద్రియాణి – మనసా – నియమ్య – ఆరభతే – అర్జున – కర్మేంద్రియైః – కర్మయోగం – అసక్తః – సః – విశిష్యతే

ప్రతిపదార్ధం

తు = అయితే ; అర్జున = ఓ అర్జునా ; యః = ఎవరైతే ; మనసా = మనస్సుతో ; ఇంద్రియాణి = ఇంద్రియాలను ; నియమ్య = వశం చేసుకుని ; అసక్తః = అనాసక్తుడై ; కర్మేంద్రియైః = ఇంద్రియాల ద్వారా ; కర్మయోగం = కర్మయోగాన్ని; ఆరభతే = ఆచరిస్తున్నాడో ; సః = అలాంటి వాడే ; విశిష్యతే = ఉత్తముడు

తాత్పర్యం

“ అయితే, ఓ అర్జునా, ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరచుకుని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు. ”

వివరణ

ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు ?

ఉత్తములు బహిర్ దమం ఆచరించనివారు;

అంతశ్శమం కోరుకునేవారు ; 

ఉత్తములు బహిర్ ఇంద్రియాలను

“ మనస్సులో మాత్రమే ” స్వాధీన పరచుకుంటారు !

ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించనివారు ; 

అయినా లోపల మహానిగ్రహాన్ని పొందినవారు.

వారు “ బయట ఏమైనా సరే … లోపల ఏమీ కాకూడదు ”

అని తెలుసుకున్నవారు !

బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల వుండదు.

బయట ప్రకృతి–సహజ–సిద్ధమైన కర్మాచరణ !

లోపల సంపూర్ణమైన కర్తృత్వభావనా శూన్యత !

ఇదే నిజమైన కర్మయోగం !