భగవద్గీత 2-58

“ యదా సంహరతే చాయం కూర్మోஉఙ్గానీవ సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || ”

 

పదచ్ఛేదం

యదా – సంహరతే – చ – అయం – కూర్మః – అంగాని – ఇవ – సర్వశః – ఇంద్రియాణి – ఇంద్రియార్థేభ్యః – తస్య – ప్రజ్ఞా – ప్రతిష్ఠితా

ప్రతిపదార్థం

చ = మరి ; కూర్మః = తాబేలు ; సర్వశః = అన్నివైపులనుండి ; అంగాని = అవయవాలను ; ఇవ = ఏవిధంగా ; యదా = ఎప్పుడూ ; అయం = పురుషుడు; ఇంద్రియార్థేభ్యః = ఇంద్రియ విషయాల నుంచి ; ఇంద్రియాణి = ఇంద్రియాలను ; సంహరతే = వెనక్కి మళ్ళిస్తున్నాడో ; తస్య = అతని ; ప్రజ్ఞా = జ్ఞానం ; ప్రతిష్ఠితా = స్థిరమైనది

తాత్పర్యం

“ తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో, అదే విధంగా ఒకానొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్ళించాలి ; అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా వుంటుంది. ”

వివరణ

అవసరమున్నప్పుడే ఆయుధ ప్రహారం చేయాలి.

అవసరంలేనప్పుడు ఆయుధాలను ఎంచక్కా ప్రక్కన బెట్టాలి.

అలాగే “ ఇంద్రియాలు ” కూడా …

భౌతిక జీవనార్థం వుపయోగించే ఉపకరణాలు మాత్రమే.

ఇంద్రియాల అవసరం వున్నప్పుడే వాటిని వ్యక్తపరచాలి.

వాటి అవసరం తీరగానే వాటిని వెంటనే ఉపసంహరించేయాలి.

అవయవాల అవసరం లేనప్పుడు, ఇంకా ఏదైనా అలికిడి అయినప్పుడు …

తాబేలు తన అవయవాలన్నింటినీ తన డిప్పలోకి లాగేసుకుని …

ముడుచుకుంటుంది.

అలాగే ప్రతి యోగీ కూడా జీవించాలి.

అలా చేసేవాడి శక్తి ఎప్పుడూ విజృంభించి వుంటుంది.

అలా చేసేవాడి జ్ఞానం ఎప్పుడూ సునిశితమై వుంటుంది.

అనవసరం అయినప్పుడల్లా మనస్సు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియ 

విషయాలను వదిలెయ్యాలి.

ఆ యా సమయాల్లో, సందర్భాలలో …

సంపూర్ణంగా అంతర్ముఖమై ఆత్మలో స్థితమవ్వాలి.