భగవద్గీత 11-54

“ భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోஉర్జున |

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప || ”

పదచ్ఛేదం

భక్త్యా – తు – అనన్యయా – శక్యః – అహం – ఏవం విధః – అర్జున – జ్ఞాతుం – ద్రష్టుం – చ – తత్త్వేన – ప్రవేష్టుం – చ – పరంతప

ప్రతిపదార్థం

తు = అయితే ; పరంతప = శత్రువులను తపింప చేసేవాడా ; అర్జున = అర్జునా ; అనన్యయా, భక్త్యా = అనన్యభక్తి ద్వారా ; ఏవం విధః = ఇటువంటి ; అహం = నేను ; ద్రష్టుం = చూడడానికి ; తత్త్వేన, జ్ఞాతుం = తత్త్వజ్ఞానం ద్వారా తెలుసుకోవడానికి ; చ = అలాగే ; ప్రవేష్టుం, చ = ప్రవేశించడానికి ; శక్యః = సమర్ధుడవుతాడు

తాత్పర్యం

“ అర్జునా ! అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని, చూసి, నాలో ప్రవేశించడానికి సాధనం.”

వివరణ

“ భక్తి ” అంటే ఏమిటి?

“ స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది ”…

అని ఆదిశంకరాచార్యులవారి నిర్వచనం.

ఏ మానవుడైనా గానీ తన యొక్క స్వ స్వరూపంతో

అనుసంధానింపబడి ఉండడమే “ భక్తి ” అని ఆయన ఉవాచ.

ఏమిటి మానవుడి “ స్వ స్వరూపం ”?

“ ఆత్మస్వరూపం ” అన్నదే మానవుడి “ స్వ స్వరూపం ”

తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే …

దర్శించుకోవడమే …

తన ఆత్మలో తాను ప్రవేశించడమే “ భక్తి ”.

వేరే ఇతర విషయాల పైకి పోనివ్వని “ అనన్య భక్తి ” కలిగి ఉండాలి.

అప్పుడే ఆత్మతత్త్వం అవగతం అవుతుంది.

దానికోసం ధ్యానసాధన చేసి తీరాలి …

ఆత్మజ్ఞాని కావాలి.