భగవద్గీత 2-20

“ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః |

అజో నిత్యః శాశ్వతోஉయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే || ”

పదచ్ఛేదం

న – జాయతే – మ్రియతే – వా – కదాచిత్ – న – అయం – భూత్వా – భవితా – వా – న – భూయః – అజః – నిత్యః – శాశ్వతః – అయం – పురాణః – న – హన్యతే – హన్యమానే – శరీరే

ప్రతిపదార్థం

అయం = ఈ ఆత్మ ; కదాచిత్ = ఎల్లప్పుడూ ; న జాయతే = పుట్టడం లేదు ; వా = మరి ; న మ్రియతే = మరణించదు ; వా = మరి ; భూత్వా =జన్మించి ; భూయః = మళ్ళీ ; భవితా న = ఉండేది కాదు ; అయం = ఇది (ఈ ఆత్మ) ; అజః = జన్మలేనిది ; నిత్యః = నిత్యమైనది ; శాశ్వతః = శాశ్వతమైంది ; పురాణః = సనాతనమైంది ; శరీరే = శరీరం ; హన్యమానే = చంపబడుతున్నా కూడా ; న హన్యతే = చంపబడదు.

తాత్పర్యం

“ ఆత్మ పుట్టేదిగాని, చనిపోయేదిగానీ కాదు; అలాగని ఒకప్పుడు వుండేదీ, మరొకప్పుడు వుండనిది కూడా కాదు ; ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే వుండేది; నాశనం లేనిది, సనాతనమైనది; అది చంపదు, చంపబడదు ; దేహం నశించినా ఆత్మ నశించదు. ”

వివరణ

ఈ “ ఆత్మ ” అనేది … “ దేహి ” అనేది …

భూతకాలంలోనూ ఉంది … భవిష్యత్‌కాలంలోనూ ఉంటుంది.

ఇది ఎప్పుడూ పుట్టలేదు … ఎప్పుడూ చావదు.

ఆత్మ అన్నది నిత్యం, శాశ్వతం, సనాతనం.

సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలం మనం.

ఈ ‘ ముక్కు ’, ఈ ‘ నోరు ’, ఈ ‘ కళ్ళు ’, ఈ ‘ కాళ్ళు ’ ఈ ‘చేతులు’ కాదు మనం …

ఈ శరీరం చంపబడితే “ ఆత్మ ” చంపబడదు.

ఈ దేహం నశిస్తే “ దేహి ” నశించదు.

ఇదే మౌలికమైన జ్ఞానం … ఆత్మజ్ఞానం !

శ్రీకృష్ణులవారి ద్వారా ప్రసారమవుతున్న భగవద్గీతాసారం.

ఇది మనం స్వానుభవం మీద తెలుసుకుని …

ఆత్మతత్త్వంలోనే ఉంటూ …

మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి.

సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి …

మననం చేసుకుంటూ వుండాలి.