భగవద్గీత 3-22

“ నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||

 

పదచ్ఛేదం

న – మే – పార్థ – అస్తి – కర్తవ్యం – త్రిషు – లోకేషు – కించన – న – అనవాప్తం – అవాప్తవ్యం – వర్త – ఏవ – చ – కర్మణి

ప్రతిపదార్ధం

పార్థ = అర్జునా ; మే = నాకు ; త్రిషు = మూడు ; లోకేషు = లోకాలలో ; కించన = ఏ కొంచెం కూడా ; కర్తవ్యం = చేయవలసింది ; న, అస్తి = లేదు ; చ = మరి ; అవాప్తవ్యం = పొందదగినది ; అనవాప్తం = పొందలేనిది ; న = లేదు ; కర్మణి = కర్మచేయడానికి ; ఏవ = లోనై ; వర్తే = నిమగ్నమై వున్నాను

తాత్పర్యం

“ అర్జునా ! నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు; మరి పొందదగినదీ, పొందలేనిదీ అంటూ కూడా ఏమీ లేదు ; అయినా నేను కర్మచేయడంలో నిమగ్నమై వున్నాను. ”

వివరణ

“ ఓ అర్జునా ! నా గురించి నేను చెప్తాను విను ” … అంటున్నాడు కృష్ణుడు !

“ త్రిషులోకేషు ” అంటే … “ మూడులోకాలు ”

ఏ మూడు లోకాలు?

‘ భూ ’, ‘ భువర్ ’, ‘ సువర్ ’ లోకాలు…

అథవా ‘ అధో ’ లోకాలు !

“ ఈ లోకాలలో నేను చేయవలసింది ఏదీ లేదు ” అన్నాడాయన !

ఈ లోకాలలో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయిందన్నమాట !

“ ఇలాంటి పరిస్థితులలో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే వున్నాను.” అని కూడా అంటున్నాడు.

“ కృష్ణ ”, అంటే “ కృ ” “ అష్ణన్ ”

“ కృ ” అంటే “ చేయవలసినవి ”

“ అష్ణన్ ” అంటే “ భుజించడం ”

“ చేయవలసిందంతా చేసి వాటి ఫలితాల్ని భుజిస్తున్నవాడి ” నే

“ కృష్ణుడు ” అంటారు !

తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి …

ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంటుంది ?

ఇక ఇతర ప్రాణికోటికి సహాయం చేయడమే మిగిలి వున్నది !

తమ్ము తాము తెలుసుకున్నవారు,

ఇంక లోకకళ్యాణానికే అంకితం అవుతారు !