భగవద్గీత 2-62

“ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోஉభిజాయతే || ”

 

పదచ్ఛేదం

ధ్యాయతః – విషయాన్ – పుంసః – సంగః – తేషు – ఉపజాయతే – సంగాత్ – సంజాయతే – కామః  – కామాత్ – క్రోధః – అభిజాయతే

ప్రతిపదార్థం

విషయాన్ = విషయాలను ; ధ్యాయతః = చింతిస్తున్న ; పుంసః = పురుషుడికి ; తేషు = ఆ విషయాలలో ; సంగః = ఆసక్తి ; ఉపజాయతే = కలుగుతుంది ; సంగాత్ = ఆసక్తి వలన ; కామః = కోరిక ; సంజాయతే = కలుగుతుంది ; కామాత్ = కోరిక వలన; క్రోధః = కోపం ; అభిజాయతే = కలుగుతుంది.

తాత్పర్యం

“ ఎల్లప్పుడూ విషయాలను గురించే ఆలోచన చేసే వాడికి వాటిమీదే ఆసక్తి కలుగుతుంది; ఆసక్తి వలన కోరిక పుడుతుంది; కోరిక వలన కోపం కలుగుతుంది. ”

వివరణ

మనం దేనిని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటామో …

దాని మీద ఆసక్తి పెరుగుతుంది.

ఎప్పుడైతే “ ఆసక్తి ” …

అంటే “ సంగం ” పెరుగుతుందో కామం ఉద్భవిస్తుంది.

కామం అంటే విపరీతమైన కోరిక.

ఎవరైనా మన కోరిక తీరకుండా ఏరకంగానైనా అడ్డుపడితే …

అంటే మన వాంఛితకామం తీరడానికి విఘ్నం కలిగిస్తే …

వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది.

విపరీతమైన కోపాన్ని “ క్రోధం ” అంటాం.

ఈ విధంగా మన నిత్య ఆలోచనల ద్వారా లౌకిక విషయాసక్తి …

తద్వారా తీవ్రమైన వాంఛ …

అది తీరకపోతే క్రోధం కలుగుతుంది.

“ ధ్యాస ” లేకపోతే “ సంగం ” వుండదు !

“ సంగం ” లేకపోతే “ కామం ” పుట్టదు !

“ కామం ” లేకపోతే “ క్రోధం ” వుండదు !