భగవద్గీత 3-38

 “ ధూమేనావ్రియతే వహ్ని ర్యథాஉஉదర్శో మలేన చ |

యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||

 

పదచ్ఛేదం

ధూమేన – ఆవ్రియతే – వహ్నిః – యథా – ఆదర్శః – మలేన – చ – యథా – ఉల్బేన – ఆవృతః – గర్భం – తథా – తేన – ఇదం – ఆవృతం

ప్రతిపదార్థం

యథా = ఏ విధంగా ; ధూమేన = పొగలో ; వహ్నిః = నిప్పు ; చ = మరి ; మలేన = ధూళిచే ; ఆదర్శ = అద్దం ; ఆవ్రియతే = కప్పబడి వుంటుందో ; యథా = ఏ విధంగా ; ఉల్బేన = మావి పొరచే ; గర్భం = గర్భంలోని పిండం ;

ఆవృతః = కప్పబడి వుంటుందో ; తథా = అదే విధంగా ; తేన = ఆ కామం ద్వారా ; ఇదం = ఈ జ్ఞానం ; ఆవృతం = కప్పబడి వుంటుంది

తాత్పర్యం

“ పొగ ” చేత నిప్పు, “ ధూళి ” చేత అద్దం, “ మావి ” చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే, ‘ కామం ’ చేత ‘ జ్ఞానం ’ కప్పబడి వుంటుంది.

వివరణ

ఎంతటి తమోగుణి అయినా … ఎంతటి రజోగుణి అయినా …

ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం సత్త్వమే …

ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం పూర్ణ జ్ఞానమే …

ఆ బీజం లోంచే, ఆ క్షేత్రం లోంచే జీవులందరూ జన్మింపబడ్డారు కనుక !

అయితే, ‘ మురికి ’ చేత ‘ అద్దం ’ కప్పబడి వుంది …

‘నివురు’ చేత ‘ నిప్పు ’ కప్పబడి వుంది …

‘ మావి ’ చేత గర్భంలోని ‘ పిండం ’ కప్పబడి వుంది …

అలాగే, ‘ కామం ’ చేత ‘ జ్ఞానం ’ కప్పబడి వుంది …

అద్దం మీద దుమ్ము కాస్త తీసెయ్యాలి !

నిప్పుమీద వున్న నివురు … కాస్త … కదిలించాలి …

అంటే కాస్త “ ఆనాపానసతి ” … అభ్యసించాలి !