భగవద్గీత 2-13

        “ దేహినోஉస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా | .                   తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || ”

 పదచ్ఛేదం

దేహినః – అస్మిన్ – యథా – దేహే – కౌమారం – యౌవనం – జరా – తథా – దేహాంతరప్రాప్తిః – ధీరః – తత్ర – న – ముహ్యతి

ప్రతిపదార్థం

యథా = ఏవిధంగా అయితే ; దేహినః = జీవాత్మకు ; అస్మిన్, దేహే = ఈ దేహంలో ; కౌమారం = బాల్యం ; యౌవనం = యవ్వనం ; జరా = ముసలితనం ; తథా = అదేవిధంగా ; దేహాంతరప్రాప్తిః = మరొక దేహం ప్రాప్తిస్తుంది ; తత్ర = ఆ విషయంలో ; ధీరః = ధీరుడైనవాడు ; న, ముహ్యతి = మోహానికి గురికాడు

తాత్పర్యం

“ దేహం వలన దేహాధారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం ; ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. ”

వివరణ

ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది.

పొత్తిళ్ళలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడచి

బాల్యదశను అనుభవిస్తుంది.

బాల్యం తర్వాత కౌమారం, ఆ తరువాత యవ్వనం ;

తరువాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరగా మరణం …

ఈ విధంగా శరీరస్థితులు మారుతూ వుంటాయి.

ఒక దశలోని రూపం తరువాతి దశకు మార్పు చెందింది.

ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది. 

“ ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి ? ”

అని ఆయాదశలలో ఎప్పుడూ మనం ఏడవటం లేదు !

ఎందుకంటే … 

“ అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం ”

అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక !

అయితే “ మరణానికి దుఃఖిస్తున్నాం ”…

ఎందుకంటే … “ ఆత్మధర్మం ” మనకు తెలియదు కనుక !

బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు

ఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశలలో కూడా మనకు గుర్తుంటాయి.

అవి అనుభవించినప్పటి రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా

అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది.

అలాగే దేహంలో ఉన్న “ దేహి ” ఈ దేహం యొక్క మరణంతో

ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు …

ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది…

అవే “ సంస్కారాలు ”.

బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది.

యవ్వనరూపం పోయి ముసలిరూపం వచ్చింది. 

అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తరువాత 

“ దేహి ” ఇంకో దేహం తీసుకుంటుంది.

జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన 

పరిపూర్ణత సంతరించుకోవడానికి …

ఈ సంస్కారాలను మోసుకుని, మరొక భౌతికదేహం పొందుతుంది.

కనుక దేహస్థితీ వుంది …

దేహాంతర స్థితీ ఉంది. 

బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో …

మరో శరీరాన్ని పొందడమూ అంతే సహజం. 

ఈ విషయాన్ని గురించి ధీరుడు అయిన వాడు,

ఆత్మసత్యాన్ని అనుభవించిన వాడు …

మోహాన్ని ఎప్పుడూ పొందడు !

ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక …

ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడూ ఏడవడు …

సదా తటస్థంగా వుంటాడు …

అథవా చిరునవ్వుతో వుంటాడు !