భగవద్గీత 9-21

“ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీ‌ణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే || ”

పదచ్ఛేదం

తే – తం – భుక్త్వా – స్వర్గలోకం  – విశాలం – క్షీణే – పుణ్యే – మర్త్యలోకం – విశంతి – ఏవం – త్రయీధర్మం – అనుప్రపన్నాః – గతాగతం – కామకామాః – లభన్తే

ప్రతిపదార్థం

తే = వారు ; తమ్ = ఆ; విశాలం = విశాలమైన ; స్వర్గలోకం = స్వర్గలోకాన్ని ; భుక్త్వా = అనుభవించాక ; పుణ్యే = పుణ్యాలు ; క్షీణే = క్షీణించగానే ; మర్త్యలోకం = మనుష్యలోకాలలో ; విశంతి = ప్రవేశిస్తారు ; ఏవం = ఈ ప్రకారంగా ; త్రయీధర్మం = మూడు రకాల ధర్మాలను ; అనుప్రపన్నాః = ఆశ్రయించేవారు ; కామకామాః = భోగాలను ఆశించినవారై ; గతాగతం = (స్వర్గమర్త్యలోకాల మధ్య) రాకపోకలను ; లభన్తే =పొందుతున్నారు

తాత్పర్యం

“ చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు ; మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడపోకడలను పొందుతున్నారు.”

వివరణ

“ విశాలమైనట్టిది స్వర్గలోకం ” అని చెబుతున్నారు వేదవ్యాసులవారు

అక్కడ .. ” “ ఆ విశాలమైన స్వర్గలోకాలలో ”…

భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి …

మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాం

అయితే “ చనిపోయిన వెంటనే ” తిరిగి రాము

యాత్రలకు తీసుకెళ్ళిన డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత …

ఇంటికి తిరిగి వచ్చినట్టు …

చేసుకున్న పుణ్యం కాస్తా స్వర్గలోకాలలో ఖర్చుపెట్టేసుకున్న తర్వాత …

అప్పుడు తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తాం.

ఎన్నో లోకాలు ఉన్నాయి :

భువర్లోకాలు, సువర్లోకాలు, జనలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు,

సత్యలోకాలు … ఎన్నెన్నో లోకాలు.

దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం?

అనేక రకాల ధర్మాలు ఉన్నాయి.

“ శరీరధర్మం ” .. “ సంఘధర్మం ” .. “ ఆత్మధర్మం ” అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి.

భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి …

ఇవి “ శరీరధర్మం ” క్రిందికి వస్తాయి.

ఏ కుటుంబంలో పుడ్తామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి … అది  “కుటుంబధర్మం ”.

ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి …

అది  “ సంఘధర్మం ” .

“ కుటుంబ ధర్మం ” అన్నది “ సంఘధర్మం ”లో అంతర్భాగం.

అయితే, ఆత్మగురించి తెలుసుకోలేదు కనుక …

ఆత్మజ్ఞానం పొందలేదు కనుక …

మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది.

మరి ఈ రాకడ పోకడలను వదిలించుకోవాలంటే …

“ ఆత్మధర్మం ” అన్నది సరిగ్గా నిర్వర్తించాలి.

అంటే …“ ఆత్మ ” గురించి తెలుసుకోవాలి …

ఒకసారి ఆత్మ గురించి తెలుసుకుంటే … “ ఆత్మధర్మం ” నిర్వర్తిస్తే …

మళ్ళీ శరీరం ఉండదు … శరీరధర్మం ఉండదు ;

“ కుటుంబం ” ఉండదు … “ కుటుంబధర్మం ” ఉండదు ;

“ సంఘం ” ఉండదు …“ సంఘధర్మం ” ఉండదు

ఆ ఊర్ధ్వలోకాల్లో హాయిగా … సదా విహరిస్తూనే ఉంటాం.

రావాలనుకుంటే వస్తాం … మాస్టర్స్‌గా ఇతరులకు ధ్యానం చెప్పడానికి

లేకపోతే రానే రాము … రానక్కరలేదు

“క్షీ‌ణే పుణ్యే ” అంటే “ పుణ్యం క్షీణించిన తరువాత ”

స్వర్గలోకాలలో కొంతకాలం వున్న తరువాత

తిరిగి భూలోకం లోనికి వస్తూంటాం.

ఎంత వరకు? …

ఆత్మమోక్షం సంపాదించేంత వరకు

“ గతాగతం ” అంటే “ గత అగత ”

“ వెళ్ళడం రావడం ” అన్నమాట

“ స్వర్గలోకాలకు వెళ్ళడం ” … “ తిరిగి అక్కడ నుంచి రావటం ” అన్నమాట

“ కామకామా ” అంటే ” కామ … అకామ ” అంటే

“ కోరికల వల్ల, మరి కోరికలను అధిగమించడం వల్ల ” అని అర్థం.

“ సరి అయిన కోరికలను ” ఆవిష్కారం చేసుకుంటూ …

ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ …

మరి ఆ భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలను …

అధిగమిస్తూ వుండాలి కూడా.