భగవద్గీత 2-27

“ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి || ”

 

పదచ్ఛేదం

జాతస్య – హి – ధ్రువః – మృత్యుః – ధ్రువం – జన్మ – మృతస్య – చ – తస్మాత్ – అపరిహార్యే – అర్థే – న – త్వం – శోచితుం – అర్హసి

ప్రతిపదార్థం

హి = ఎందుకంటే ; జాతస్య = పుట్టినవాడికి ; మృత్యుః = మరణం ; ధ్రువః = నిశ్చయం ; చ = అంతేకాక ; మృతస్య = మరణించినవానికి ; జన్మ = పుట్టుక ; ధ్రువం = తప్పదు ; తస్మాత్ = అందువల్ల ; అపరిహార్యే = తప్పించ వీలుకాని; అర్థే = విషయంలో ; త్వం = నువ్వు ; శోచితుం = శోకించడానికి ; న అర్హసి = అర్హుడవు కావు

తాత్పర్యం

“ పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ”

వివరణ

“ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ? ”

అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

“ చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా …

‘ నేను మాత్రం చావను ’ అనుకుంటాడు మనిషి.

అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం! ” అని జవాబిస్తాడు ధర్మరాజు.

మనం రోజూ చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా

పసిప్రాయంలోనే “ అకాల మృత్యువాత ” పడి మరణించే వారిని.

అలాగే యవ్వనంలో, ప్రౌఢ ప్రాయంలో ఉన్నవారి దగ్గరనుండి

వృద్ధాప్యంలో ఉన్న వారి వరకూ వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు

రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు.

ఇన్ని చూస్తూనే ఉన్నా, “ మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు ” అన్న

భ్రమలో ఉంటూంటాం మనం !

చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి,

ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి.

“ చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే,

వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను ” అంటాడు బుద్ధుడు.

“ ఇంతేనా, వెంటనే తెస్తా ” అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి …

తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది. 

పుట్టినవారు చావక తప్పదు ; చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు.

వచ్చేవారు పోక తప్పదు ; పోయేవారు రాక తప్పదు.

చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది పైకి వస్తుంది.

పైన ఉన్నది క్రిందకి వస్తుంది.

భూలోకంలోని వారు స్వర్గలోకం లోకి వెళ్తారు.

స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు.

ఈ చక్రభ్రమణానికి ఏడవడం ఎందుకు ?

ఇది మనకోసం మనం ఏర్పరచుకున్న చక్రభ్రమణం.

చిన్నప్పుడు మనం పాఠాశాలలకు వెళ్ళి తరగతి తరువాత తరగతి పూర్తిచేశాం కదా !

అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల !

ఇక్కడికి వస్తాం. కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం !

క్రొత్త క్రొత్త పాఠాలు నేర్చుకోడానికి అనువుగా ఉండే

వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం.

ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం;

కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు.

జన్మపరంపరలో పుట్టుకకు సంతోషం …

మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే …

“ మనం సత్యాన్ని తెలుసుకోలేదు ” అని అర్థం !

“ ఇంకా అజ్ఞానం పోలేదు ” అని అర్థం !

ఏ క్షణంలోనైనా చావు రావచ్చు …

కనుక ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించాలి.

ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని …

ఒకానొక పండితుడు !

మన రాకలు, మన పోకలు మన చేతుల్లోనే వున్నాయి.

వాటికి మనమే సృష్టికర్తలం.

“ అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది ” …

“ నా పోక పైవాడి చేతుల్లో ఉంది ” అనేవి స్థూలదృష్టిలోని సత్యాలు.

కానీ సూక్ష్మదృష్టిలో, దివ్యదృష్టిలో అవి అసత్యాలు.