భగవద్గీత 3-37

“ కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |

మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ||

 

పదచ్ఛేదం

కామః – ఏషః – క్రోధ – ఏష – రజోగుణసముద్భవః – మహాశనః – మహాపాప్మా – విద్ధి – ఏనం – ఇహ – వైరిణం

ప్రతిపదార్థం

రజోగుణసముద్భవః = రజోగుణం వల్ల కలిగిన ; ఏషః = ఈ; కామః=కామమే; క్రోధః = మితిమీరిన కోపం ; ఏషః = ఇది ; మహాశనః = ఎంతమాత్రమూ తృప్తి చెందనీయదు ; మహాపాప్మా = మహా పాపిష్టిది ; ఏనం = దానిని ; ఇహ = ఈ సందర్భంలో ; వైరిణం = శత్రువుగా ; విద్ధి = తెలుసుకో

తాత్పర్యం

“ రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం ; ఇది ఎంత మాత్రమూ తృప్తి చెందనివ్వదు; ఇది మహాపాపి. ఈ సందర్భంలో దీనిని ‘ శత్రువు ’ అని తెలుసుకో. ”

వివరణ

అన్ని గుణాల్లోనూ రజోగుణం మహా పాపభూయిష్ఠమైనది.

ఒకానొక రజోగుణి యొక్క ప్రధాన చిహ్నమే క్రోధం.

‘ క్రోధం ’ అన్నదే ఆత్మకి పరమ శత్రువు.

మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధం.

క్రోధం వున్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు.

క్రోధాత్ములు అశాంతిమయులు.

అయితే, ఆత్మపరిణామక్రమంలో ఇది ఒకానొక ‘ తప్పనిసరి ’ దశ.

ఆ దశను త్వరగా దాటేసేయాలి …

త్వరత్వరగా దాటేసేయాలి.

అక్కడ అనేక జన్మలు వృథా చేయరాదు.

ఎవ్వరికైనా గానీ … రజోగుణ దశల్లో ఒక జన్మ వుండడం 

“ తప్పనిసరి ” అయినదే !

కానీ … అనేక జన్మలు వుండడం అన్నది “ తప్పే సరి ” యే మరి !