భగవద్గీత 3-15

“ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవమ్ |

తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||

 

పదచ్ఛేదం

కర్మ – బ్రహ్మోద్భవం – విద్ధి – బ్రహ్మ – అక్షర సముద్భవం – తస్మాత్ – సర్వగతం – బ్రహ్మ – నిత్యం – యజ్ఞే – ప్రతిష్ఠితం

ప్రతిపదార్ధం

కర్మ = కర్మ సముదాయం ; బ్రహ్మోద్భవం = వేదాల నుంచి పుడుతోంది ; బ్రహ్మ = వేదం ; అక్షర సముద్భవం = నాశరహితుడైన పరమాత్మ నుండి పుడుతోంది ; విద్ధి = తెలుసుకో ; తస్మాత్ = అంచేత ; సర్వగతం = సర్వత్రా వ్యాపించి వున్న ; బ్రహ్మ = బ్రహ్మ; నిత్యం = ఎల్లప్పుడూ ; యజ్ఞే = యజ్ఞంలో ; ప్రతిష్ఠితం = ప్రతిష్ఠితుడని తెలుస్తుంది.

తాత్పర్యం

“ ఆ ‘ సత్కర్మ సముదాయం ’ ‘ వేదం ’ వల్ల పుడతోంది. ‘ వేదం ’ అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతోంది ; దీనిని బట్టి సర్వవ్యాప్తమైన ‘ అక్షర పరబ్రహ్మ ’ ఎల్లప్పుడూ ‘యజ్ఞం ’ ద్వారానే ప్రతిష్ఠితుడవుతున్నాడని తెలుస్తుంది. ”

వివరణ

‘సత్‌కర్మ’ ఎక్కడ నుంచి పుడుతుంది?

అది జ్ఞానం ద్వారానే … జ్ఞానం ఉంటేనే … పుడుతుంది !

‘ జ్ఞానం ’ అన్నదానిని పురాతన హిందూ వాజ్మయంలో “ వేదం ”  అని అన్నారు !

వేదం ఎక్కడ నుంచి పుడుతుంది ?

మూలచైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది !

మూలచైతన్యాన్ని అర్ధం చేసుకున్నప్పుడే పుడుతుంది !

“ బ్రహ్మ” అంటే అంతటా వ్యాపించి ఉన్న”…

“ అక్షర ” అంటే “ ఎప్పటికీ నశించని ” అని !

అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ ‘ యజ్ఞం ’ ద్వారానే వ్యక్తం అవుతుంది !

అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితమవుతుంది !

“ ప్రతష్ఠితం ” అంటే “ పునః పునః విశ్లేషింపబడడం ” !