భగవద్గీత 3-43

“ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ||

 

పదచ్ఛేదం

ఏవం – బుద్ధేః – పరం – బుద్ధ్వా – సంస్తభ్య – ఆత్మానం – ఆత్మనా – జహి – శత్రుం – మహాబాహో – కామరూపం – దురాసదం

ప్రతిపదార్థం

ఏవం = ఈ విధంగా ; బుద్ధేః = బుద్ధి కన్నా ; పరం = అతీతమైనది ; బుద్ధ్వా = తెలుసుకుని ; ఆత్మనా = బుద్ధి ద్వారా ; ఆత్మానం = మనస్సుని ; సంస్తభ్య = వశపరచుకుని ; మహాబాహో = గొప్ప బాహుభుజాలు గల అర్జునా ; కామరూపం = ‘కామం’ అనే ; దురాసదం = జయించడానికి కష్టమైనటువంటి ; శత్రుం = శత్రువును ; జహి = చంపు

తాత్పర్యం

“ ఓ అర్జునా, బుద్ధి కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకుని … బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకుని … జయించడానికి కష్టమైనటువంటి ‘కామం’ అనే శత్రువుని చంపి జయించు. ”

వివరణ

సంఘం ఇచ్చిన అల్పబుద్ధి కన్నా బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి ;

సంఘం చెప్పిన దానికి తల వంచరాదు ;

ఆత్మను తెలుసుకోవాలి … ఆత్మ చెప్పిన దానికే తలవంచాలి !

ఆత్మజ్ఞానం ప్రాప్తించక ముందు “ సంఘం ఇచ్చిన బుద్ధి ” మాత్రమే వుంటుంది;

ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత … “ ఆత్మ ఇచ్చిన బుద్ధి ” వస్తుంది;

మొదటిది అల్పబుద్ధి … రెండవది మహితాత్మకమైన బుద్ధి !

“ సంఘ బుద్ధి ” అనారోగ్యాలనూ, దుఃఖాలనూ కలిగిస్తే …

“ ఆత్మ బుద్ధి ” ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తుంది !

విశృంఖలమైన మనస్సు ఆత్మానుభవం ద్వారానే వశపరచబడుతుంది ;

అప్పుడే ‘క్రోధం’ అనే శత్రువు చంపబడుతుంది ;

ఆత్మజ్ఞానం తదనంతరమే “ అరిషడ్ వర్గాలు ”

“ మిత్ర షడ్ వర్గాలు ” గా మారుతాయి !

“ ‘రజోగుణి’ అయినా, ‘తమోగుణి’ అయినా మొట్టమొదటగా ఆత్మలో దూకండి” … ఇదే శ్రీకృష్ణుని సందేశం.

“ ఆత్మలో దూకడం ” ఎలా ?

అది “ ఆనాపానసతి ” అభ్యాసం ద్వారానే జరుగుతుంది !!