భగవద్గీత 3-12

“ ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||

 

పదచ్ఛేదం

ఇష్టాన్ – భోగాన్ – హి – వః – దేవాః – దాస్యంతే – యజ్ఞభావితాః – తైః – దత్తాన్ – అప్రదాయ – ఏభ్యః – యః – భుంక్తే – స్తేనః – ఏవ – సః

ప్రతిపదార్ధం 

యజ్ఞభావితాః = యజ్ఞం ద్వారా ఉన్నతులైన ; దేవాః = దేవతలు ; వః = మీకు ; ఇష్టాన్ = అభీష్టమైన ; భోగాన్ = భోగాలను ; హి = నిశ్చయంగా ; దాస్యంతే = ఇస్తారు ; తైః = ఆ దేవతల ద్వారా ; దత్తాన్ = ఇవ్వబడిన భోగాలను ; యః = ఏ పురుషుడు ; ఏభ్యః = ఎవ్వరికీ ; అప్రదాయ = ఇవ్వకుండానే ; భుంక్తే = అనుభవిస్తాడో ; సః = అలాంటివాడు ; స్తేనః = దొంగ ; ఏవ = అవుతున్నాడు

తాత్పర్యం

“ ‘యజ్ఞం’ ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడక్కుండానే ఇస్తారు ; ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులెవ్వరికీ ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు ‘దొంగ’ అవుతున్నాడు. ”

వివరణ

యజ్ఞాల ద్వారా దేవతలు … ఆస్ట్రల్ మాస్టర్లు … సంతుష్టులవుతారు.

యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు …

అడక్కుండానే ప్రసాదాలు పంచి పెడ్తారు. 

పైలోకంవారిని “ ప్రసాదం ఇవ్వండి ” అని వేరే అడగనక్కర లేదు !

నిజానికి స్వంతానికి కావలసినదానికన్నా ఎక్కువే పెడతారు !

అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి.

మనమే పూర్తిగా ‘ స్వాహా ’ చేయకూడదు !

అలా చేస్తే “ దొంగ ” అని తప్పక అభివర్ణించబడతాం.

ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిదీ !

అదీ సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం !

మనకన్నా హీనస్థితిలో వున్నవారికి మన దగ్గర వున్నది పంచిపెడుతూ వుంటే పైలోకాలలో వున్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకు కావలసినవి

మనకు సంతోషంగా సమకూరుస్తూనే వుంటారు !