భగవద్గీత 2-29

“ ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః

|ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాஉప్యేనం వేద న చైవ కశ్చిత్ || ”

 

పదచ్ఛేదం

ఆశ్చర్యవత్ – పశ్యతి – కశ్చిత్ – ఏనం – ఆశ్చర్యవత్ – వదతి – తథా – ఏవ– చ – అన్యః – ఆశ్చర్యవత్ – చ – ఏనం – అన్యః  – శృణోతి – శ్రుత్వా– అపి – ఏనం – వేద –న – చ – ఏవ – కశ్చిత్

ప్రతిపదార్థం

కశ్చిత్ = ఒకడు ; ఏనం = దీనిని (ఈ ఆత్మను) ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యమైనదిగా; పశ్యతి = చూస్తాడు ; చ = మరి ; తథా, ఏవ = అలాగే ; అన్యః = మరొకడు ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యకరంగా ; వదతి = చెపుతాడు ; చ = అలాగే ; అన్యః = మరొకడు ; ఏనం = దీనిని ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యంగా ; శృణోతి = వింటాడు ; చ = మరి ; కశ్చిత్ = ఒకడు ; శ్రుత్వా, అపి = విన్నప్పటికీ ; ఏనం = దీనిని ; న, ఏవ, వేద = తెలుసుకోలేడు.

తాత్పర్యం

“ ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ; మరొకడు ఆశ్చర్యంగా చెపుతున్నాడు; ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు; కానీ – వినటం చేత – ఆత్మను గురించి తెలుసుకోలేరు. ” 

వివరణ

ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు …

అని నాలుగు రకాలైన మనుషులు ఉంటారు.

మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను

మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం.

“ ఆత్మ” అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు.

ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు.

ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికీ ఉనికి అనేది లేనప్పుడు …

ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు … ఆత్మ ఒక్కటే ఉంటుంది.

“ చూసేవాడు ” అని గానీ .. “ చూడబడేది ” అని గానీ .. వేరు వేరుగా ఏమీ ఉండవు.

అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి.

జ్ఞానచక్షువును సంతరించుకున్న యోగులు … 

ఆత్మజ్ఞానం కలిగిన యోగులు …

బయటనుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారు. 

కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని

తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.

బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.

అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం.

ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేదీ ఈ లోకంలోనే లేదు

కనుక దానిని వర్ణించలేము.

అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూంటారు.

వారు దివ్యచక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను

ఆశ్చర్యకరంగా వివరిస్తూంటే … ముముక్షువులైన వాళ్ళు …

ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి .. అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు.

అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు.

అయితే ఆ జ్ఞానులు చూసినది, చెప్పింది వింటే మాత్రమే

ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు.

ఆత్మ గురించి తెలుసుకోవాలంటే …

తమ ప్రయత్నం తాము చెయ్యాలని ముముక్షువులకు తెలుసు.

కనుక వారు ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు.

అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా …

ఏ మాత్రం తెలుసుకోలేరు … తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయరు.

చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా !