భగవద్గీత 4-36

“ అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి || ”

 

పదచ్ఛేదం

అపి – చేత్ – అసి – పాపేభ్యః – సర్వేభ్యః – పాపకృత్తమః – సర్వం – జ్ఞానప్లవేన – ఏవ – వృజినం – సంతరిష్యసి

ప్రతిపదార్థం

సర్వేభ్యః పాపేభ్యః = పాపులందరికంటే ; పాపకృత్తమః = ఎక్కువగా పాపాలను చేసినవాడు ; అసి చేత్ అపి = అయినా ; జ్ఞానప్లవేన ఏవ = జ్ఞానమనే నౌక ద్వారా; సర్వం వృజినం = సమస్త పాప సముద్రాన్నీ ; సంతరిష్యసి = పూర్తిగా దాటగలడు.

తాత్పర్యం

“ నువ్వెంత విపరీత పాపాత్ముడవైనప్పటికీ, జ్ఞానమనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు. ”

వివరణ

‘ జ్ఞానం ’ రావాలంటే, ‘ ఆత్మజ్ఞానం ’ కావాలంటే …

ధ్యానసాధన చెయ్యాలి … ధ్యానయోగిగా మారాలి.

శ్వాసానుసంధానం ద్వారా మనస్సును శూన్యం చెయ్యాలి …

చిత్తవృత్తులను నిరోధించాలి.

ఈ ధ్యానయోగంలో … ఈ ధ్యానసాధనలో … ఈధ్యానయజ్ఞంలో

మనకు ఆత్మానుభూతి కలుగుతుంది.

క్రమేపీ జీవాత్మ, బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి …

ఆ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం !

ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతమవుతుందో …

అప్పుడు ఆ “ జ్ఞానం ” అనే అగ్నిలో …

“ జ్ఞానాగ్ని ” లో … మన పాపకర్మలు అన్నీ సమూలంగా దగ్ధం అయిపోతాయి.

జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే …

పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటి వెయ్యగలం !

“ నేను పాపాత్ముడిని కదా … నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో ”

అనే అనుమానాన్ని విడిచి …

తక్షణం ధ్యానసాధనను ప్రారంభిస్తే …

ఎటువంటి హీన గతమైనా …

వర్తమాన

ధ్యానయోగసాధనతో …

‘ గతం గతః ’ అన్నట్లుగా గతించిపోతుంది.