“ధ్యాన ఖైధీ ప్రాజెక్ట్”

 

తప్పుచేసిన వాడిని సంఘం నుంచి వెలివేసి తనవాళ్ళకు దూరంగా… జైల్లో ఖైదీగా ఉంచడం ద్వారా… అతనిలో తన గురించిన ఆలోచన మొదలై తన ప్రస్తుత స్థితికి మూలకారణాలను వెదికే మానసిక పరివర్తన రావాలి అని న్యాయస్థానాలు వారికి జైలుశిక్షలు విధిస్తాయి.

అయితే వారు ఆ ఖాళీ సమయాల్లో ఇక చేయడానికి ఏమీ లేక “idle man’s mind is a devil’s work shop” లాగా అక్కడ ఉన్న ఇతర ఖైదీలతో చేరి ఇంకా క్రొత్త క్రొత్త దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ… బయటికి రాగానే ప్రభుత్వానికి సవాలుగా, మరి సంఘానికి ప్రమాదకరంగా మారుతున్నారు. వీళ్ళను ఏ విధంగా సంస్కరించాలి?

“వీళ్ళలో పరివర్తన ఎలా తేవాలి?” “….అసలు వీళ్ళను వీళ్ళు తెలుసుకునేట్లుగా ఎలా ఆత్మదర్శనం చేయించాలి?”… అని అలోచించిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్…. ‘ధ్యాన ఖైదీ ప్రాజెక్ట్’ ద్వారా రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో… అధికారుల అనుమతితో 40 రోజుల “ధ్యాన మండల దీక్షలు” చేపడుతోంది.

వరంగల్ సెంట్రల్ జైలు, రాజమండ్రి జైలు, జనగాం సబ్ జైలు, కరీంనగర్ జిల్లా కారాగారం, ఖమ్మం సబ్ జైలు, చర్లపల్లి జైలు… ఇంకా రాష్ట్రవ్యాప్తంగా… ఇలాంటి కారాగారాల్లో పలు ధ్యానయజ్ఞాలు నిర్వహించి చక్కటి ఆత్మజ్ఞానంతో కూడిన పుస్తకాలను ఖైదీలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎందరో ఖైదీలు తమలో గొప్ప మార్పుని తెచ్చుకుని జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా బయట ప్రపంచంలో కూడా ధ్యాన ప్రచారాలు చేపడుతూ, ఎంతో గౌరవంగా జీవిస్తున్నారు. జైలర్లు మరి పోలీసు అధికారుల మన్ననలు పొందుతూ… వరంగల్ సెంట్రల్ జైలులో ఏకంగా “వాల్మీకి పిరమిడ్” నిర్మాణం కూడా జరుపుకున్నారు అక్కడి ఖైదీలు. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ ధ్యాన ఖైదీ ప్రాజెక్టుకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలను విశేషంగా చేపడుతున్నారు.