దేవి చక్కా – న్యూజెర్సీ – అమెరికా

“పత్రీజీ న్యూజెర్సీ పర్యటన”

పత్రీజీ సందేశం

లక్ష్యసాధనలో ముందూ, వెనుకా చూస్తూ ఉంటే ఎప్పటికీ లక్ష్యం చేరుకోలేం. ముందడుగు వేసుకుంటూ వెళితేనే గమ్యం చేరగలం. ధ్యానసాధన కూడా అదేవిధంగా చెయ్యాలి. ధ్యానసాధన ఉన్నప్పుడు మాత్రమే మనం మనుష్యులం. మనం సాధన చేయవలసిన ఒకే ఒక విషయం ధ్యానం .. అంటూ జీవితాన్ని సరిచేసుకునే తొమ్మిది విషయాలు 1. “యుక్తాహారం” 2. “మితాహారం” 3. “నిరాహారం” 4. “యుక్తభాషణం” 5. “మితభాషణం” 6. “నిర్భాషణం” 7. “యుక్తయోచనం” 8. “మిత యోచనం” 9. “నిర్యోచనం” ల గురించి వివరించి వేణునాదంతో ధ్యానం చేయించారు.

“వెస్ట్‌గార్డ్ లైబ్రెరీ మీటింగ్ హాలు”

“పిల్లల చిన్నతనంలో తల్లితండ్రుల ప్రధమ కర్తవ్యం వారిని చూసుకోవడమే. వారు నిద్రించినప్పుడు మాత్రమే ధ్యానం. బిడ్డకు ఎనిమిది సంవత్సరాలు నిండేవరకు మీ బాధ్యతే. ఆపై మీరు వారికి స్నేహితులు మాత్రమే. ఆ స్నేహంలో నాలుగు విషయాలు పంచుకోవాలి. అవి మీ సమయం, జ్ఞానం, సమాచారం, బుద్ధి కుశలత ..” అంటూ వేణునాద ధ్యానం చేయించారు.

“The Club of Ricochet”

“ప్రతి వ్యక్తి నుంచీ .. ప్రతి పుస్తకం నుంచీ తెలుసుకోవలసినది ఎంతో కొంత ఉంటుంది. అది తెలుసుకుంటూ ముందుకు సాగినప్పుడే సత్యం సంపూర్ణంగా అవగతం అవుతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆ సత్యం ‘నేనే దైవం’ .. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే .. ఆత్మస్వరూపులే” అని తెలుపుతూ మరి “ధ్యానం చెయ్యని వారు ఈ సత్యాన్ని తెలుసుకోలేరు. మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలిసినా మంచిని ఎంచుకోలేక పోవడానికి కారణం ధ్యానసాధన లేకపోవడమే” అని తెలిపారు.