పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ “లోగో”

 

సృష్టిలోని ప్రతి ఒక్కజీవీ .. “శక్తి – Energy” .. “చైతన్యం – Consciousness” .. మరి “ప్రజ్ఞ – Wisdom” ల యొక్క సంపూర్ణ సమగ్ర స్వరూపం.

ఈ మూడింటి యొక్క పాళ్ళల్లో ఉన్న తేడాను బట్టి, వేరు వేరు జీవం యొక్క వేరు వేరు సామర్థ్యం .. వేరు వేరు సందర్భాలలో .. వేరు వేరు విధాలుగా .. సంకల్పానుసారంగా .. అభివ్యక్తమవుతూ ఉంటాయి.

మన ఆత్మ యొక్క సామార్థ్యాన్ని బట్టి .. అనంత పరిణామక్రమంలో భాగంగా మనం రకరకాల జన్మల తీసుకుంటూ మన యొక్క శక్తినీ, జ్ఞానాన్నీ పెంపొందించుకుని .. తద్వారా వాటికి ఆధారమైనా వికసిత చైతన్యాన్నీ, ఆత్మానందాన్నీ అందుకుంటూ ఉంటాం.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ “లోగో” లోని విశేషాంశాలు :

1. త్రిభుజం

2. త్రినేత్రంలో ఉన్న ధ్యాని

3. Energy – శక్తి

4. Consciousness – చైతన్యం

5. Wisdom – ప్రజ్ఞ

“త్రిభుజం”

పూర్ణాత్మకు ప్రతీక ఈ త్రిభుజం. భూమి మీద జన్మతీసుకున్న జీవాత్మ ఇక్కడ ప్రాపంచిక జీవితాన్ని జీవిస్తూనే విశ్వంలో ఉన్న పూర్ణాత్మ నుంచి సంపూర్ణ జ్ఞానాన్నీ పొందటమే ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క మౌలికమైన ఉద్దేశ్యం. ఈ పూర్ణాత్మ ” Three in one ” లాంటిది. అంటే ఈ పుర్ణాత్మ “చేసేది” “తెలుసుకునేది”, “ఆలోచించేది” అన్న మూలతత్త్వ విభాగాల యొక్క సంపూర్ణ స్వరూపం !

అందుకే ధ్యానంలో మనం .. మన పూర్ణాత్మను “ఎప్పుడూ కదులుతూన్న త్రిభుజంగా .. 3-D పిరమిడ్ లాగా” ఒకవైపు కోణంలో చూస్తాం.

“త్రినేత్రంలో ఉన్న ధ్యాని”

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ “లోగో” లో “ధ్యానం చేస్తున్న వ్యక్తి” ని చిత్రీకరించాం. ప్రజలందరి ముఖ్య ఉద్దేశ్యమైన దివ్యజ్ఞానప్రకాశానికి మార్గం సుగమం మరి సత్వరం చేసేది ధ్యానం మాత్రమే.

ఈ చిత్రంలో ఉన్న ధ్యాని భూభౌతిక స్థాయికి పైన ఉన్నాడు. ఎందుకంటే ధ్యానంలో మనం భూమ్యాకర్షణశక్తిని దాటగల ఆత్మశరీరధారులమవుతాం .. మరి స్థూలశరీరం నుంచి సూక్ష్మశరీరాదులు విడుదలై సునాయాసంగా, స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. సూక్ష్మశరీరయానం అనేది మనం సాధించవల్సిన ఆధ్యాత్మిక లక్ష్యాలలో ఒకటి.

“ధ్యానం” అంటే అంతరేంద్రియాలను చైతన్యపరచడమే! మన అంతరేంద్రియాల సంపూర్ణతా చిహ్నమే త్రినేత్రం/ దివ్యచక్షువు.

ధ్యానంలో నెమ్మది నెమ్మదిగా దివ్యచక్షువు ఉత్తేజం పొంది, దాని అత్యున్నత స్థాయిలో ఆకాషిక్ రికార్డ్సును స్పష్టంగా చూడగలగటం జరుగుతుంది. అంటే పరిపూర్ణ దార్శనికత, దివ్యదృష్టి కలగడం అన్నమాట. “ఋషి” అంటే “ద్రష్ట” అంటే దివ్యదృష్టి కలిగి గొప్ప అతీత స్థితిని చూస్తాడు .. మరి ఈ సృష్టిలో ఇతర ఫ్రీక్వెన్సీస్‌లో ఉన్న అనేక విశ్వాలను దర్శించగలడు. ఈ భూతలంలో జరిగే అన్ని కార్యాలనూ, వాటి వెనుక ఉన్న కారణాలనూ చాలా స్పష్టంగా చూడగలుగుతాడు.

దివ్యనేత్రాన్ని సంపాదించడంమే” ఆధ్యాత్మిక పరమైన పతాక అభివృద్ధి” అనబడుతుంది.

సృష్టిలోని ప్రతి జీవి “శక్తి”, “చైతన్యం” మరి “ప్రజ్ఞ”ల సముదాయమే! క్రమక్రమంగా మన శక్తినీ, జ్ఞానాన్నీ పెంపొందించుకుని .. వాటి ద్వారా వాటికి ఆధారమైన చైతన్యాన్నీ, ఆత్మానందాన్నీ అందుకోవాలి.

త్రిభుజాకారం మధ్యలో గుర్తులు .. స్వాధ్యాయం .. కూర్చున్న ధ్యాని మరి ధ్యానం. వీటి ఆధారంగా పైన ఉన్న “జ్యోతి’ ని అంటే “పూర్ణాత్మ” ను చేరాలి .. అంటే “ఆత్మసాక్షాత్కారం” సాధించాలి.

“శక్తి .. ENERGY”

“ప్రాణశక్తి అంతటా నిండి ఉంది ; అంతా ప్రాణశక్తిమయం” అన్నది సృష్టి యొక్క మౌలిక సత్యం, ఆనాపానసతి ధ్యానసాధన ద్వారా మాత్రమే విశ్వం అంతటా నిండి ఉన్న విశ్వమయప్రాణశక్తి మన అంతర్‌శరీరాల్లోకి ప్రవేశించి నాడీమండలశరీరాన్ని శుద్ధి చేస్తుంది.

“ప్రజ్ఞ .. WISDOM”

ఆనాపానసతి ధ్యానం ద్వారా ఇతోధికమైన శక్తినీ, ఏకాగ్రతనూ, అలవోకగా అధ్యయనం చేయగలిగినవారై .. మౌలిక ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ అత్యంత సులభంగా ఆకళింపు చేసుకుంటారు.

“ఎరుక .. CONSCIOUSNESS”

ఆనాపానసతి యొక్క నిరంతర సాధన ద్వారా ఆత్మజ్ఞానపరాయణులమైనప్పుడు .. తదనుగుణంగా .. మనం మరింత ఎరుకతో – పూర్ణఆత్మస్థాయిచైతన్యం తో కూడిన దైనందిన భౌతిక జీవితాన్ని క్షణక్షణం బ్రహ్మానందయుతంగా అనుభవిస్తూ ఉంటాం.

మనం అంతా శక్తి, చైతన్యం, ప్రజ్ఞ ల శకలాలమే ; ఈ సృష్టి ఉనికి మొత్తం కూడా ఈ మూడే .. అంటే శక్తి, చైతన్య ప్రజ్ఞ శకలాల మయమే ; అంతకు తప్ప మరేది కాదు. ఈ మూడూ పరస్పరం ముడిపడి ఉన్నాయి.

మనం ఎంత శక్తివంతులమైతే .. అంత చైతన్య వంతులమవుతాం. వెనువెంటనే ఆత్మజ్ఞానాన్ని పొందుతాం. మనకు ఎక్కువ జ్ఞాన్నం ఉంటే, మరింత చైతన్యవంతులమవుతూ, మరింత ఎక్కువగా శక్తివంతులమవుతాం ; అలాగే మిగతావి కూడా.

జన్మ- కర్మ పరంపరల పరమార్థం .. మన శక్తి, చైతన్యం, జ్ఞానం పెంపొందించుకోవడం మరి అదే పరిమాణక్రమం కూడా!

“అప్పో దీపో భవ”

“BE A LIGHT UNTO YOURSELF”

“ఎవరికీ వారే దిక్కు” అన్నదే పరమ సత్యం. ఎవరి వాస్తవాన్ని వారే గతంలో “స్వ ఇచ్ఛ”తో సిద్ధింపచేసుకున్నారు ; వర్తమానంలో ఎవరి వాస్తవాన్ని వారి “స్వ ఇచ్ఛ” ద్వారానే సిద్ధం చేసుకుంటున్నారు ; భవిష్యుత్తులో కూడా ఎవరి వాస్తవం అన్నది వారి “స్వ-ఇచ్ఛ” .. అంటే వారి స్వీయ ఎంపిక / నిర్ణయాల చేతుల్లోనే వుంటుంది !