మరణానంతర జీవితం

 

“ఒకానొక ఆత్మజ్ఞానికి ప్రతిరోజూ పండుగే! అతనికి ఏది ఉన్నా, ఏది లేకపోయినా .. ఇంట్లో పుట్టుక ఉన్నా, చావు ఉన్నా .. అంతా సంబరమే! “ఆత్మజ్ఞానం లేకముందు ‘ఎందుకురా దేవుడా ఈ జీవితం?’ అని ఏడిస్తే .. ఆత్మజ్ఞాని అయిన తరువాత ‘భలే .. భలే ఈ జీవితం’ అంటూ ఆనందంలో చిందులు వేస్తూంటాడు! “ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నపిరమిడ్ బృహత్ కుటుంబ సభ్యులంతా సంవత్సరాంతంలో జరుపుకునే ధ్యానమహాచక్రం సంబరాల కోసం ‘కైలాసపురి’కి విచ్చేసి .. ఇవి పూర్తయ్యాక మన ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతాం; ఎవరి ఊళ్ళకు వాళ్ళం .. ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోతాం! “ఇక్కడికి వచ్చాం కనుక .. ఇక్కడ ధ్యానం చేసుకుని .. కొంత ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ లాభంతో ఆనందంగా మన ఇళ్ళకు చేరుకుంటాం! “వెళ్ళగానే అక్కడి వాళ్ళంతా ‘ఇన్ని రోజులూ ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు?’ అని ఆరాలు తీస్తారు. అప్పుడు మనం ఇక్కడి విశేషాలన్నీ చెబుతాం! ‘క్రొత్త క్రొత్త వాళ్ళందరినీ కలుసుకున్నాం .. గంటలు గంటలు ప్రాతఃకాల ధ్యానాలూ, నాద ధ్యానాలూ, చేసుకున్నాం’ అని చెబుతాం!

“‘అవునా! .. ధ్యానమహాచక్రం-VII లో అలా జరిగిందా? .. అంత సంగీతమా?’ అని వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ‘ఈసారి మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా అక్కడ తీసుకుని వెళ్ళండి; మేం కూడా అక్కడ ధ్యానం చేసుకుంటాం’ అని చెబుతారు. “మన ఈ భూలోక ప్రయాణం కూడా అలాంటిదే!!”

“ఆత్మజ్ఞానపరంగా ఈ సృష్టిలో ‘A to Z’ లోకాలు ఎన్నెన్నో ఉంటాయి. ‘A’ నుంచి ‘B’ కి వెళ్ళాలి అంటే క్రింద ఉన్న భూలోకానికి రావలసిందే .. మరి ‘B’ నుంచి ‘C’కి వెళ్ళాలన్నా మళ్ళీ భూలోకానికి రావలసిందే!

“భూలోకంలో నేర్చుకునే పాఠాలను బట్టీ మరి అందులో ఆత్మచైతన్యంతో మనం పొందే అనుభవజ్ఞానాన్ని బట్టీ .. ఒక్కోసారి మనం .. ‘B’ నుంచి ‘D’కి వెళ్ళవచ్చు లేదా ఇంకా ఎక్కువ ప్రమోషన్‍తో ఇంకా ఉన్నతమైన ‘E’ లోకాలకు కూడా వెళ్ళవచ్చు!”

“ఇదంతా కూడా మనం భూలోకానికి వస్తూ పోతూ .. ఇక్కడి కష్టాలలో పడి ‘నుజ్జు నుజ్జు’ అవుతూ అవుతూ ఉండడాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఎంత ‘నుజ్జు నుజ్జు’ అయితే అంత ‘డబుల్ ప్రమోషన్’ అన్నమాట!

వందేళ్ళో .. యాభైయేళ్ళో .. పదేళ్ళో .. మరి మూడునెలలో .. ఇలా తల్లి గర్భం ద్వారా భూలోకానికి వచ్చి విశేషంగా ఆత్మజ్ఞానాన్ని గ్రోలి ఆనందంగా మన నిజలోకాలకు తరలి వెళ్ళిపోతాం! ‘ఇన్నాళ్ళూ ఏం చేసివచ్చారు?’ అని అడిగే పై లోకవాసులకు ఇక్కడి ముచ్చట్లన్నీ సంబరంగా చెప్పుకుంటాం!

“మనల్నీ, మనవాళ్ళనూ మర్చిపోకుండా ప్రతి క్షణం ధ్యానస్థితిలోనే ఉంటూ .. భూలోకంలోని వాళ్ళందరికీ ధ్యానప్రచారం చేసి వచ్చాం’ అని చెబితే వాళ్ళంతా మనకు చప్పట్లే .. చప్పట్లు!!”