“ఆధ్యాత్మిక విద్య అంటే ‘నేను అది అయివున్నాను”

 

పత్రీజీ: “మనం ముఖ్యంగా మూడు విషయాలను తెలుసుకుని అనుసరించాలి అవి:

  * ఒక్క క్షణం కూడా ఎప్పుడు వృధా చేయకూడదు.

* ఏ ఒక్కరూ ఏ ఇతర వ్యక్తి కంటే తక్కువ కాదు

* ఏ ఒక్కరూ ఏ ఇతర వ్యక్తి కంటే మరి ఎక్కువ కూడా కాదు” అన్నారు.

పత్రీజీ: “మతం అన్నది పాఠశాల స్థాయికీ, ఆధ్యాత్మికత అన్నది కళాశాల స్థాయికీ, మరి ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది విశ్వవిద్యాలయ స్థాయికీ చెందినవి. ఆధ్యాత్మిక శాస్త్రం శాస్త్రీయ సిద్ధాంతాలు, సశాస్త్రీయ అనుభవాలతో కూడుకున్నది. అది వ్యక్తులు, వ్యక్తిత్వాల గురించి చర్చించదు. మనం అందరం ఒకే బృహత్ చైతన్యానికి చెందిన వారం అన్న ఎరుక కలిగిన వారి సమూహమే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమ్మేళనం.

“ఒకానొక వృక్షానికి అనేక పత్రాలు ఉంటాయి. ఒక చేతికి అయిదు వ్రేళ్ళు ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటీ ఎక్కువా కాదు, తక్కువా కాదు. అలాగే మానవులు అందరూ కూడా. మానవులకు మాత్రమే కాదు .. సృష్టిలోని ప్రతి జీవికి కూడా, దేని ప్రాధాన్యత, స్థానాలు దానికి ఉన్నాయి.

“మీరు మతానికి చెందిన వ్యక్తిగా వుంటే ఆధ్యాత్మికులుగా ఎదగండి. అధ్యాత్మికులుగా వుంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎదగండి. “భగవద్గీతలో వేదవ్యాసుల వారు శ్రీకృష్ణుని ద్వారా ‘అన్ని విద్యలలోనూ నేను సర్వ శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక విద్యను’ అని తెలిపారు.

“ఆధ్యాత్మిక విద్య అంటే ‘నేను అది అయివున్నాను’ .. అని తెలుసుకోవటం .. నేను .. అదిగా చూడగలిగితే ప్రతీదీ నేనే అని తెలుస్తుంది. అలాగే చూడగలం. “ఎవ్వరూ నాకంటే వేరుగా లేరు. ఏ ఒక్కరూ ఏ ఇతర వ్యక్తి కంటే ఎక్కువా కాదు మరి తక్కువా కాదు. ఆధ్యాత్మికతలో రంగు, రూపు, కులం, మతం .. ఇవి అన్నీ మూర్ఖ అభిప్రాయాలు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలిగిన చైతన్య స్థాయికి చేరాలి అంటే ఎవరైనా ధ్యానం చెయ్యాలి. సృష్టిలోని అనేకానేక లోకాలు దర్శించాలి అంటే దివ్యనేత్రం కావాలి. అది ధ్యానం ద్వారానే పొందగలరు.

“మేఘం వర్షంగా మారుతుంది. వర్షంగా (నీరుగా) మారే ముందు అది మేఘం. అదే విధంగా మనం ఈ మానవరూపం ధరించటానికి ముందు దైవాలం. నీటికి తాను మేఘం అని తెలియక ‘మేఘం ఆకాశంలో వుంటుంది’ అనుకున్నట్లే మనం కూడా ‘మనమే దైవం’ అని తెలుసుకోక .. ‘దైవం మనకు భిన్నంగా ఎక్కడో వుంది’ అనుకుంటున్నాం. అయితే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ‘తాము దైవాలం, అంతటా ఉన్నాం’ అని తెలుసుకున్నవారు.

“మనం పరస్పరం పరిపూర్ణత చెందించుకోవటానికి ఉన్నాం, రెండు చేతులూ వేరు అయినప్పటికీ ఒక్కటే, మనం ఏకకాలంలో మానవుడూ, దైవమూ .. మానవ దైవం.

“మనం అనేక శరీరాలు కలిగి ఉన్నాం. ప్రతి ఒక్క శరీరమూ మిగిలిన వాటికి సహాయం చేస్తుంది. ప్రతి శరీరాన్నీ, ప్రతి లోకాన్నీ అవగాహన చేసుకోవటమే ఆధ్యాత్మిక శాస్త్రం. “జీవితంలో విజయమూ – అపజయమూ, లాభమూ-నష్టమూ రెండూ ముఖ్యమైనవే. విజయం అన్నది న్యూనతా భావాన్నీ, అపజయం అన్నది అతిశయ భావాన్నీ తగ్గిస్తాయి. రెండూ చవిచూస్తే సానబెట్టబడిన వజ్రంలా ప్రకాశిస్తాం. ప్రతి సందర్భమూ, ప్రతి సంఘటనా మన ఉన్నతీకరణకే అని తెలుసుకుని ఉపయోగించుకోవాలి.

“మన మనస్సు యొక్క శక్తి ఎక్కడ వుంటే శారీరక శక్తి అక్కడ ఉంటుంది. శరీరమే శక్తి .. దైవమే శరీరం. అంతేకానీ ‘శరీరం’లో దైవం లేదు. “పదార్థం శక్తి, మనస్సు కూడా శక్తియే. మనం అనవసరపు విషయాలు చూడటం, వినటం ద్వారా శక్తి కోల్పోతాం. అటువంటి వాటి నుంచి తప్పించుకుంటే శక్తిని నిల్వ చేసుకుంటాం.

“ధ్యానంలో మూడు సోపానాలు .. 1. కళ్ళు మూసుకోవటం ద్వారా శరీరశక్తిని వృధా చేయనీయకుండా నిలిపి వుంచుకోవటం .. దీనినే ‘దమం’. ‘బహిరేంద్రియ నిగ్రహం’ అంటారు. మనస్సులో ఏం జరిగినా కళ్ళు తెరవకూడదు.  2. శ్వాసను గమనిస్తే మనస్సు శూన్యం అవుతుంది .. దీనినే ‘సమం’ .. ‘అంతరేంద్రియ నిగ్రహం’ అంటాం. 3. శరీర, మనో శక్తులను వృధా పరచుకోకుండా నిలిపి వుంచుకోవటం ద్వారా ఆత్మయొక్క శక్తి అభివృద్ధి చెందుతుంది. “ధ్యానం ద్వారా మనం ‘మూలచైతన్యం’ అని అర్థం అవుతుంది” అని చెప్పారు.

“మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం; ప్రతి ఒక్కరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా మలచటానికే మనం ఇక్కడ వున్నాం. “ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అయిదు వ్రేళ్ళు గురించి వివరిస్తూ .. చిటికెన వ్రేలు – శరీరం .. ఉంగరపు వ్రేలు – మనస్సు .. మధ్యవ్రేలు – బుద్ధి .. చూపుడు వ్రేలు – ఆత్మ .. బొటన వ్రేలు – సర్వాత్మలకు సంకేతాలు.

“ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనం అయిదు. శరీరం, మనస్సు రెండూ ఈ జన్మ నుంచి వస్తాయి. బుద్ధి జన్మ పరంపర నుంచి వికసిస్తూ వుంటుంది. ఆత్మ, సర్వాత్మలు శాశ్వతమైనవి.

“మనం “శరీర స్థాయిలో .. ‘ఆడ’, ‘మగ’ .. రెండుగా వుంటాం. మనస్సు స్థాయిలో .. ‘హిందూ’, ‘ముస్లిం’, ‘వైశ్య’, ‘శూద్ర’ .. వంటి వివిధ మనస్సులతో .. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో .. అన్ని రకాల మనస్సులు కలిగి ఉంటాం.

“బుద్ధి స్థాయిలో .. ఇతరులకు హాని చేసేవారు .. ఇతరులకు మేలు చేసే వారు .. రెండు రకాలుగా ఉంటారు. హాని చేసే వారే ‘కౌరవులు’, మేలు చేసే వారే ‘పాండవులు’. బుద్ధి ఉన్నవారు సహాయం చేస్తారు. బుద్ధి లేనివారు హాని చేస్తారు. హాని చేసే వారు .. రాక్షసులు; మేలు చేసే వారు .. మానవులు. రాక్షసులు సాటి జీవులకు హాని చేసి తింటారు; మానవులు సహాయం చేసి తింటారు.

“ఎవరికైనా ఏదైనా ఇచ్చి వారి నుంచి ఏదైనా తీసుకోవడం ఆధ్యాత్మికత. ఎవరినుంచయినా ఏమైనా తీసుకుని ఏదైనా ఇవ్వడం వ్యాపారం. గౌతమ బుద్ధుడు ప్రజలకు బుద్ధిని ఇచ్చి భిక్ష స్వీకరించేవాడు. అదేవిధంగా సోక్రటీస్ కూడా ప్రజలకు వివేకాన్ని పంచేవాడు.

“ఆత్మ స్థాయిలో ‘జ్ఞాని’, ‘అజ్ఞాని’ అని రెండు తీరులు. తాను ఆత్మను అని తెలుసుకున్న వాడు జ్ఞాని, తాను ఆత్మను అని తెలుసుకోనివాడు అజ్ఞాని.

“సర్వాత్మ ఎప్పుడూ ఒకే ఒక్కటిగా ఉంటుంది. అక్కడ మనం ‘అంతా ఒక్కటే .. అన్నీ ఒక్కటే’ అనే ఏకత్వ స్థితికి చేరుతాం.”ఐదువ్రేళ్ళనూ ‘రెండు’ .. ‘అనేకం’ .. ‘రెండు’ .. ‘రెండు’ .. ‘ఏకం’ .. అని చెప్పేదే ఆధ్యాత్మిక శాస్త్రం. అయిదు వ్రేళ్ళల్లో నాలుగు ఒక వైపు .. ఒక్కటే రెండవ వైపు ఉంటాయి. ఆ ఒక్కటిని చేరటమే విజయం. అందుకే బొటన వ్రేలుని విజయ చిహ్నంగా సూచిస్తాం.

“బొటన వ్రేలు చూపుడువ్రేలు కలిపి వలయంగా చేసి మిగిలిన మూడు వ్రేళ్ళు నిటారుగా ఉంచడాన్ని ‘చిన్ముద్ర’ అంటాం. అది అహం బ్రహ్మాస్మికి .. దివ్యజ్ఞాన ప్రకాశానికి సంకేతం. ఆ స్థితికి చేరడమే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుని లక్ష్యం. ఆ జ్ఞానం పొందినప్పుడు మనం మన వర్తమాన జీవితంతో పాటు గత జన్మల ప్రభావం నుంచి కూడా దూరమవుతాం.

“మన శరీరాన్ని చూసుకోవడానికి మనం అద్దం ముందు నిలబడతాం. మన మనస్సును మన చర్యలు/పనులు ద్వారా తెలుసుకుంటాం. మన తెలివితో మన తప్పులను మనం చూడలేం. మన తెలివి మన చర్యలను గురించి వాస్తవమైన నిర్ధారణలను ఇవ్వజాలదు. కేవలం ఒకానొక గురువు మాత్రమే ఆ పని చేయగలడు/చూపగలడు.

“కేవలం ధ్యానం మాత్రమే మన ఆత్మను మనకు తెలియజేస్తుంది. ధ్యానం అంటే శరీరం, మనస్సు, బుద్ధిలను దాటి వెళ్ళడం. “ఒకానొక బిడ్డ ఏడుస్తూంటే తల్లి వెంటనే వెళ్ళి బిడ్డకు పాలు ఇస్తుంది. బిడ్డ స్వయంగా ఏమీ చేయలేదు. తల్లి అక్కడ ఉంది అని కూడా బిడ్డకు తెలియదు. అయినప్పటికీ ఏడవటం అనే చిన్న చర్య ద్వారా తల్లికి సంకేతం పంపుతుంది. అదేవిధంగా మనం ధ్యాన సాధన చేస్తే మన పూర్ణాత్మ మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మనం ఎప్పటికీ బిడ్డలమే.. అలాగే మనకు ఎప్పుడూ ‘పూర్ణాత్మ’ అనే ‘తల్లి’ ఉంటుంది. మనం ధ్యానంలో ఆ ఎప్పటికీ ఉండే తల్లి కోసం ఎదురు చూస్తాం.

“ధ్యానం అనేది ఉన్నది ఉన్నట్లుగా చూపడానికి వీలుపడదు. అందుకే TVలలో ధ్యానం తప్ప మిగిలినవన్నీ చూపిస్తారు. ధ్యానంలో బాహ్యంగా చూపించగలిగేది ఏదీ ఉండదు. ధ్యాన ఫలితాలు చూపగలమే కానీ ధ్యానస్థితి చూపడానికి వీలుపడదు. ఎందుకంటే అది అంతరంలో సంభవించే మార్పు” అన్నారు.